హీరో సూర్యను కొందరు టార్గెట్ చేస్తున్నారు: భారతీ రాజా సంచలన వ్యాఖ్యలు

  • తన తాజా చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్న సూర్య
  • తాము నష్టపోతామంటున్న థియేటర్ యాజమాన్యాలు
  • సూర్య గురించి కామెంట్ చేస్తే ఊరుకోబోమని భారతీరాజా హెచ్చరిక
ప్రముఖ తమిళ నటుడు సూర్యకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. తాజాగా ఆయన నటించిన 'సూరారై పొట్రు' అనే చిత్రం తెలుగులో కూడా 'ఆకాశమే హద్దురా' పేరుతో విడుదలవుతోంది. అయితే, కరోనా కారణంగా థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో... ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. ఈ నిర్ణయాన్ని తమిళనాడులోని థియేటర్ యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

కావాలనే కొందరు సూర్యను టార్గెట్ చేస్తున్నారని భారతీరాజా ఆరోపించారు. దీని వెనుక రాజకీయ నాయకుల ప్రోద్బలం కూడా ఉందని అన్నారు. థియేటర్స్ లో సినిమాలు ఆడేటప్పుడు టికెట్ దగ్గర్నుంచి పార్కింగ్, పాప్ కార్న్ వరకు పెద్ద దోపిడీ జరిగిందని... అప్పుడు ఎవరూ ప్రశ్నించలేదని చెప్పారు. పెద్ద హీరోల సినిమాల కోసం తక్కువ బడ్జెట్ సినిమాలకు థియేటర్లను ఇవ్వనప్పుడు కూడా ఎవరూ అడగలేదని మండిపడ్డారు. ఇప్పుడు సూర్య ఓటీటీలో సినిమాను విడుదల చేస్తున్నాడని తెలియగానే... థియేటర్లు నష్టపోతాయని రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో అర్థంకాని పరిస్థితి నెలకొందని భారతీరాజా అన్నారు. ఈ తరుణంలో సూర్య తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. ఓటీటీలో విడుదల అనేది మొత్తం సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్య అని... దీన్ని ఒక వ్యక్తి సమస్యగా చూడకూడదని హితవు పలికారు. సూర్య కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు కొందరు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యపై ఎవరు కామెంట్ చేసినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే అందరం కూర్చొని పరిష్కరించుకుందామని చెప్పారు.


More Telugu News