పోలవరం ప్రాజక్టుపై ప్రధాని మోదీకి సీఎం వైయస్ జగన్ లేఖ

  • పోలవరంను 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం
  • కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయండి
  • పోలవరంను కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది
ప్రధాని మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను విడుదల చేయాలని లేఖలో కోరారు. 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని... ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేసేందుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.  

కాగ్ ఆడిట్ రిపోర్టు, సవరించిన అంచనా వ్యయాలను ఇప్పటికే అందించామని చెప్పారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక పనుల కోసం ఈ ఏడాది జూన్‌ వరకు రూ.12,312.88 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని... ఇందులో రూ.8,507.26 కోట్లను పీపీఏ ద్వారా కేంద్రం రీయింబర్స్‌ చేసిందని... మిగిలిన రూ.3,805.62 కోట్లను తక్షణమే రియింబర్స్ చేయాలని కోరారు. సకాలంలో నిధులను విడుదల చేసేలా కేంద్ర జల్ శక్తి శాఖకు దిశానిర్దేశం చేయాలని కోరారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో పోలవరం పనులకు రూ. 15 వేల కోట్లు అవసరమని జగన్ తెలిపారు. విభజన చట్టం సెక్షన్ 90 ప్రకారం పోలవరంను కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామని హామీ కూడా ఇచ్చిందని చెప్పారు. ప్రాజెక్టు పనులు 33.23 శాతం, హెడ్‌ వర్క్స్‌లో సివిల్‌ పనులు 71 శాతం, కుడికాలువ పనులు 92 శాతం, ఎడమ కాలువ పనులు 52 శాతం, భూసేకరణ, సహాయ, పునరావాస ప్యాకేజీ పనులు 19 శాతం పూర్తయ్యాయని తెలిపారు.


More Telugu News