కీలక సమావేశం నిమిత్తం సీఎంలను పిలిచిన సోనియా గాంధీ.. జతకలసిన మమతా బెనర్జీ!

  • కేంద్రాన్ని ప్రశ్నించడమే లక్ష్యం
  • జేఈఈ, నీట్ వద్దంటున్న విపక్షాలు
  • జీఎస్టీ బకాయిల పైనా ఒత్తిడి
  • హాజరు కాబోవడం లేదన్న ఉద్ధవ్, పినరయి, కేజ్రీవాల్
కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు అధిష్ఠానం వైఖరిని ప్రశ్నిస్తూ, లేఖాస్త్రాన్ని సంధించి, కలకలం రేపిన వేళ, విపక్షాల ఐక్యతపై ప్రశ్నలు కూడా రాగా, నష్ట నివారణకు కాంగ్రెస్, టీఎంసీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. దేశంలోని బీజేపీయేతర సీఎంలను అందరినీ పిలిచి సమావేశం నిర్వహించాలని సోనియాగాంధీ, మమతా బెనర్జీ నిర్ణయించారు. వీరిద్దరి నేతృత్వంలో సమావేశం జరుగనుండగా, కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న వేళ, జేఈఈ, నీట్ పరీక్షలను జరిపించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న అంశంపై ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది.

ఈ పరీక్షలను వాయిదా వేయాలని కేంద్రంపై పలు రాష్ట్రాల సీఎంలు పట్టుబట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశం నేడు వర్చ్యువల్ విధానంలో జరుగనుండగా, కరోనా కారణంగా ఆదాయాన్ని నష్టపోయిన రాష్ట్రాలకు కేంద్రం నుంచి పరిహారం అందించే విషయంలో ఒత్తిడి తేవాలన్న అంశం కూడా ఎజెండాలో ఉన్నట్టు తెలుస్తోంది. జీఎస్టీ బకాయిలను తక్షణం చెల్లించాలని కూడా సీఎంలు కేంద్రాన్ని డిమాండ్ చేయవచ్చని సమాచారం.

కేంద్రం నుంచి 14 శాతం జీఎస్టీ పరిహారం కావాలని విపక్ష ముఖ్యమంత్రులు కోరవచ్చని తెలుస్తోంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్రంపై పోరాటంలో తామంతా ఏకతాటిపై ఉన్నామన్న సంకేతాలను పంపించడమే కాంగ్రెస్, టీఎంసీ అధినేత్రుల ముఖ్య ఉద్దేశమని, ఇదే సమయంలో విద్యార్థులు, మధ్య తరగతి, పేద ప్రజలు లాక్ డౌన్ సమయంలో ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి కూడా ఒత్తిడి తేవాలని వీరు భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

ఇదిలావుండగా, ఈ సమావేశానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో పాటు కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా హాజరు కాబోవడం లేదని తెలుస్తోంది. నలుగురు కాంగ్రెస్ రాష్ట్రాల సీఎంలు హాజరవుతారని సమాచారం.


More Telugu News