ప్రియుడితో ముద్దు పెట్టించుకున్న నవ వధువు.. ఆమెను వదిలేసి వెళ్లిపోయిన వరుడు!

  • తెలంగాణలోని హుజూరాబాద్‌లో ఘటన
  • బరాత్‌తో వెళ్తుంటే అడ్డగించి వధువును ముద్దుపెట్టుకుని తనతో పంపాలని గొడవ
  • ఇంటికెళ్లిపోయిన వరుడు.. పోలీస్ స్టేషన్‌లో కుమార్తెను వదిలేసిన తల్లిదండ్రులు
పెద్దల మాట కాదనలేక పెళ్లి చేసుకున్న ఓ యువతి అత్తారింటికి వెళ్తూ ప్రియుడిని పిలిపించుకుని భర్త ఎదుటే ముద్దు పెట్టించుకుంది. దీంతో వివాహమై మూడు గంటలు కూడా కాకముందే ఆ పెళ్లి పెటాకులై వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. తెలంగాణలోని హుజూరాబాద్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. హుజూరాబాద్‌కు చెందిన యువతికి, మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన యువకుడికి సోమవారం రాత్రి వివాహం జరిగింది. హుజూరాబాద్‌కే చెందిన వంశీ అనే యువకుడిని యువతి ఇప్పటికే ప్రేమించింది. అయితే, తల్లిదండ్రుల మాట కాదనలేక వారు కుదిర్చిన వివాహానికి అంగీకరించింది.

మరోవైపు, ప్రియురాలి పెళ్లి విషయం తెలిసిన ప్రేమికుడు వంశీ.. యువతితో తాను దిగిన ఫొటోలు, ప్రేమ లేఖలను వరుడుకి పంపి ఆమెను పెళ్లి చేసుకోవద్దని బెదిరించాడు. అయితే, అదేమీ పట్టించుకోని వరుడు సోమవారం ఆమె మెడలో మూడుముళ్లు వేశాడు. పెళ్లి తంతు ముగిసిన తర్వాత రాత్రికి బరాత్‌తో వరుడి ఇంటికి బయలుదేరారు.

తాము బరాత్‌తో బయలుదేరినట్టు ప్రేమికుడికి యువతి సమాచారం అందించింది. దీంతో జమ్మికుంట రోడ్డులో కాపుకాసిన వంశీ వధూవరులున్న వాహనాన్ని అడ్డగించి ఆమెను కిందికి దింపి వరుడి ఎదుటే ఆమెకు ముద్దుపెట్టాడు. ఆమెను తనకిచ్చేసి వెళ్లిపోవాలని గొడవకు దిగాడు. దీంతో వరుడి తరపు బంధువులు పోలీసులను ఆశ్రయించారు.

వధూవరులకు ఆ రోజు రాత్రి వరకు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ ఇరు వర్గాలు రాజీపడకపోవడంతో వధువును అక్కడే వదిలేసి వరుడు మందమర్రి వెళ్లిపోయాడు. మరోవైపు, తల్లిదండ్రులు కూడా కుమార్తెను పోలీస్ స్టేషన్‌లోనే వదిలిపెట్టి వెళ్లిపోయారు. పోలీస్ స్టేషన్‌లో ఒంటరిగా మిగిలిన వధువును పోలీసులు కరీంనగర్‌లోని స్వధార్ హోంకు తరలించారు. ఆమె ప్రియుడు వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News