కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్ హ్యాక్!

  • హ్యాక్ చేసి పాకిస్థాన్ అనుకూల నినాదాలు
  • భారత ప్రభుత్వానికి హెచ్చరిక
  • అందులో ప్రభుత్వ సమాచారం లేదన్న అధికారులు
బీజేపీ నేత, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్ హ్యాక్‌కు గురైంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం నాడే సైట్‌ను హ్యాక్ చేసిన దుండగులు అందులో పాకిస్థాన్ అనుకూల నినాదాలు పోస్టు చేసి భారత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కిషన్ రెడ్డి వెబ్‌సైట్ హ్యాక్ అయినట్టు నిన్న ఆయన కార్యాలయం తెలిపింది.

అయితే, ఈ వెబ్‌సైట్‌ వ్యక్తిగతమైనది కావడంతో అందులో ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు. అందులో ఆయన వ్యక్తిగత వివరాలు, పర్యటన సమాచారం, పాల్గొంటున్న కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇవన్నీ పబ్లిక్ డొమైన్‌లో ఉన్నవేనని, కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం కిషన్‌రెడ్డి వెబ్‌సైట్‌ను ఓపెన్ చేస్తే తాత్కాలికంగా అందుబాటులో లేదన్న సందేశం స్క్రీన్‌పై కనిపిస్తోంది.


More Telugu News