తన బ్యాట్లు రిపేర్ చేసిన వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిసి సచిన్ సాయం

  • బ్యాట్ రిపేరింగ్ లో పేరుగాంచిన అష్రాఫ్ చౌదరి
  • సచిన్, కోహ్లీ, స్మిత్, పొలార్డ్ లకు బ్యాట్లు రిపేర్ చేసిన అష్రాఫ్
  • 12 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. తాను క్రికెట్ ఆడే రోజుల్లో తన బ్యాట్లకు మరమ్మతులు చేసిన అష్రాఫ్ చౌదరి (అష్రాఫ్ చాచా) అనారోగ్యంతో ఆసుపత్రిపాలయ్యాడని తెలిసి చలించిపోయారు. అతడి ఆరోగ్య పరిస్థితి పట్ల స్పందించిన సచిన్ భారీ మొత్తంలో ఆర్థికసాయం అందించారు.

క్రికెట్ వర్గాల్లో అష్రాఫ్ చాచా అంటే ఎంతో గుర్తింపు ఉంది. సచిన్, విరాట్ కోహ్లీ వంటి భారత క్రికెటర్లకే కాదు, స్టీవ్ స్మిత్, క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్ వంటి అంతర్జాతీయ క్రికెటర్లు కూడా బ్యాట్ రిపేర్ వచ్చిందంటే అష్రాఫ్ చాచానే సంప్రదిస్తారు. ముంబయిలో 'అష్రాఫ్ బ్రో' పేరిట ఆయనకు ఓ దుకాణం కూడా ఉంది. క్రికెట్ ను ఎంతో ప్రేమించే ఈ ముంబై వాలా ఆటపై అభిమానంతో కొన్నిసార్లు ఉచితంగా బ్యాట్లు రిపేర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట.

అష్రాఫ్ చాచా చాలాకాలంగా మధుమేహం, న్యూమోనియాతో బాధపడుతున్నాడు. ఆయన గత 12 రోజులుగా సవ్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిసి సచిన్ స్పందించారు. అష్రాఫ్ ను పరామర్శించడమే కాదు, ఉదారంగా ధనసాయం చేసినట్టు అష్రాఫ్ సన్నిహితుడు ప్రశాంత్ జెఠ్మలాని తెలిపారు.


More Telugu News