తిరుమలలో ఎలుగుబంటి కలకలం.. అటవీప్రాంతంలోకి మళ్లించిన అధికారులు
- తిరుమల ఔటర్ రింగురోడ్డుపైకి వచ్చిన ఎలుగుబంటి
- వాహనంతో వెంటతరిమిన విజిలెన్స్ అధికారులు
- కొద్దిదూరం పరుగుతీసి అటవీప్రాంతంలోకి వెళ్లిన భల్లూకం
లాక్ డౌన్ రోజుల్లో తిరుమల పుణ్యక్షేత్రంలో వన్యప్రాణుల సంచారం అధికమైంది. గత కొన్నిరోజులుగా చిరుతపులులు, జింకలు, అడవిపందులు, ఎలుగుబంట్లు వంటి జంతువులు తిరుమలలోనూ, ఘాట్ రోడ్లపైనా దర్శనమిస్తున్నాయి. తాజాగా ఓ ఎలుగుబంటి తిరుమల క్షేత్రం ఔటర్ రింగురోడ్డుపై కనిపించింది. రాత్రివేళ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న విజిలెన్స్ సిబ్బంది ఆ ఎలుగుబంటిని చూసి తమ వాహనం నిలిపివేశారు. అయితే అది ఆ వాహనం వద్దకే రావడంతో అధికారులు దాన్ని అదలించారు. ఆపై, వాహనం నిదానంగా నడుపుతూ దాన్ని పాపవినాశనం రోడ్డువైపు తరుముకుంటూ వెళ్లారు. సాధారణంగా నిదానంగా వెళ్లే ఎలుగుబంటి విజిలెన్స్ వాహనాన్ని చూసి దౌడు తీసింది. కొంతదూరం రోడ్డుపైనే పరుగులు తీసి, పక్కనే ఉన్న అటవీప్రాంతంలోకి వెళ్లిపోయింది.