బాలుడ్ని అపహరించి కోటి రూపాయల డిమాండ్.. రెండుగంట్లోనే కిడ్నాపర్ ను పట్టేసిన పోలీసులు!

  • తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఘటన
  • కిడ్నాప్‌నకు పాల్పడిన బాలుడి బంధువు
  • పోలీసులకు భయపడి బాలుడిని వదిలి పరార్
మూడేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేసిన వ్యక్తిని పోలీసులు రెండుగంటల్లోనే పట్టుకుని కటకటాల వెనక్కి పంపారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఆర్కేపేట ఇస్లాంనగర్‌కు చెందిన బాబు అలియాస్ ముబారక్ (40) షోళింగర్‌లో చికెన్ దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడికి పర్వేష్ (9), రిష్వంత్ (6), అజారుద్దీన్ (3) అనే కుమారులున్నారు. చిన్న కుమారుడైన అజారుద్దీన్ శనివారం ఇంటి బయట ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. చిన్నారి కోసం వెతుకుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. పిల్లాడిని తానే కిడ్నాప్ చేశానని, కోటి రూపాయలు ఇస్తే వదిలిపెడతానని బెదిరించాడు. దీంతో భయపడిన ముబారక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ముబారక్‌కు వచ్చిన ఫోన్ నంబరు సిగ్నల్ ఆధారంగా నిందితుడి కోసం గాలించారు. విషయం పోలీసులకు చేరిందని తెలుసుకున్న కిడ్నాపర్ వంగనూరు క్రాస్‌రోడ్డు వద్ద బాలుడిని వదిలి పరారయ్యాడు. అక్కడ ఏడుస్తున్న బాలుడిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడిని తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు. అదే గ్రామానికి చెందిన ముబారక్ బంధువైన సులైమాన్ (30) బాలుడిని కిడ్నాప్ చేసినట్టు పోలీసుల విచారణ తేలడంతో అతడిని అరెస్ట్ చేశారు.


More Telugu News