ఢిల్లీలో భారీ పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు.. ఐఎస్ ఉగ్రవాది అరెస్ట్

  • ఆగస్టు 15న పేలుళ్లకు కుట్ర
  • రెండు కుక్కర్లలో 15 కిలోల పేలుడు పదార్థాలు నింపిన ఉగ్రవాది
  • కట్టుదిట్టమైన భద్రత నేపథ్యంలో ఆగస్టు 15న పారని పథకం
దేశ రాజధాని ఢిల్లీలో పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. 36 ఏళ్ల మహ్మద్ ముస్తాకీమ్ ఖాన్ అనే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. యూపీలోని బలరాంపూర్‌కు చెందిన ఉగ్రవాదికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. గ్రామంలోనే ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తున్న ముస్తాకీమ్‌కి ఐఎస్ సానుభూతిపరుడితో పరిచయం ఏర్పడింది. దీంతో క్రమంగా ఉగ్రవాద కార్యకలాపాలవైపు ఆకర్షితుడయ్యాడు. ఐఈడీ బాంబులు, ఆత్మాహుతి బెల్టులు సిద్ధం చేయడంలో శిక్షణ పొందాడు. ఈ క్రమంలో ఉగ్రవాద సంస్థ ఆదేశాల మేరకు ఆగస్టు 15న ఢిల్లీలో పేలుళ్లకు పథకం సిద్ధం చేశాడు.

నిజానికి ముస్తాకీమ్ ఆత్మాహుతి దాడికి పాల్పడాలని భావించాడు. అయితే, తొలుత ప్రెజర్ కుక్కర్లతో బాంబు దాడి చేసి ఆ తర్వాత ఆత్మాహుతి దాడికి పాల్పడవచ్చన్న ఆదేశాలతో సరేనన్నాడు. దీంతో పంద్రాగస్టు నాడు ఢిల్లీలో పేలుళ్లు జరిపేందుకు రెండు ప్రెజర్ కుక్కర్లలో 15 కిలోల పేలుడు పదార్థాలు (ఐఈడీ) నింపి సిద్ధం చేశాడు. అయితే, ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఉండడంతో బాంబులు పట్టుకుని నగరంలోకి ప్రవేశించడం వీలు కాకపోవడంతో వెనక్కి తగ్గాడు. అయితే, అవే బాంబులతో ఢిల్లీలోని జనసమ్మర్థం గల ప్రాంతంలో పేలుళ్లు జరపాలని నిర్ణయించుకున్నాడు.

గత శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఢిల్లీలోని దౌలాఖాన్-కరోల్‌బాగ్ రోడ్డులో బైక్‌పై వేగంగా వెళ్తున్న ఉగ్రవాది ముస్తాకీమ్‌‌ను పోలీసులు ఆపే ప్రయత్నం చేయగా, వారి పైకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి తప్పించుకుపోయాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తనిఖీ చేయగా, అతడి వద్ద రెండు కుక్కర్లు కనిపించాయి. వాటిలో బాంబులు అమర్చినట్టు చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

బుద్ధ జయంతి పార్కులో పెద్ద గొయ్యి తీసి వాటిని అందులో పూడ్చిపెట్టిన పోలీసులు నియంత్రిత పద్ధతిలో వాటిని పేల్చారు. అలాగే, నిందితుడు కాల్పులకు ఉపయోగించిన 0.30 బోర్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 8 రోజుల పోలీసు కస్టడీకి ఆనుమతించారు.


More Telugu News