చైనా తమ భూభాగాలను ఆక్రమించిందన్న కథనాలను ఖండించిన నేపాల్

  • నేపాల్ తో సరిహద్దులను పంచుకుంటున్న చైనా
  • ఏడు జిల్లాలను విస్తరించిందంటూ కథనాలు
  • గతంలోనూ ఈ ఆరోపణలు వచ్చాయన్న నేపాల్
నేపాల్ కు చెందిన పలు భూభాగాలను చైనా ఆక్రమించిందని, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి సహకారంతో చైనా తెగబడిందని మీడియాలో కథనాలు రావడం తెలిసిందే. దీనిపై నేపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కథనాలను ఖండించింది. మీడియాలో ప్రచారం అవుతున్న అంశాల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. నేపాల్ తో సరిహద్దులు పంచుకుంటున్న తన ఏడు జిల్లాలను చైనా విస్తరిస్తోందని ఆ కథనాల్లో పేర్కొన్నారు.

ఇందుకు నేపాల్ వ్యవసాయ శాఖ సర్వే విభాగం నివేదికే సాక్ష్యం అంటూ ఆ కథనాల్లో వెల్లడించారు. అయితే నేపాల్ ప్రభుత్వ వర్గాలు ఈ ఆరోపణలను కొట్టిపారేశాయి. నేపాల్ కు చెందిన ఒక ప్రముఖ పత్రిక జూన్ లోనే ఈ తరహా ఆరోపణలు చేసిందని, ఆపై తప్పుడు కథనాలకు క్షమాపణలు తెలిపిందని వివరించాయి. ఇప్పుడు మళ్లీ అవే ఆరోపణలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశాయి.


More Telugu News