అమెరికా అధ్యక్షుడిపై తీవ్ర విమర్శలు చేసిన సోదరి... ఎన్నికల వేళ ట్రంప్ కు ఇంటిపోటు!

  • ట్రంప్ అబద్ధాల కోరు అంటూ సోదరి బ్యారీ విమర్శలు
  • క్రూరమైన వ్యక్తి అంటూ వ్యాఖ్యలు
  • ఆడియో టేపుల్లోని సంభాషణలు పత్రికలో ప్రచురితం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఆయన సోదరి మరియాన్నే బ్యారీ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బయటికొచ్చాయి. ట్రంప్ ఓ అబద్ధాల కోరు అని, ఏమాత్రం విలువలు లేని వ్యక్తి అని బ్యారీ పేర్కొంది. ట్రంప్ మేనకోడలు మేరీ లియా రాసిన ఓ పుస్తకం (టూ మచ్ అండ్ నెవర్ ఎనఫ్: హౌ మై ఫ్యామిలీ క్రియేటెడ్ ద వరల్డ్స్ డేంజరస్ మ్యాన్) ఇటీవలే ప్రచురితం కాగా, ఆ పుస్తకం రాసే సమయంలో మేరీ లియా... బ్యారీతో జరిపిన సంభాషణలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ ఏమాత్రం తగినవాడు కాదని బ్యారీ పేర్కొంది. కొన్ని సందర్భాల్లో క్రూరంగా ప్రవర్తిస్తాడని ఆమె ఆరోపించింది. ఈ మేరకు ఆడియో టేపుల్లో వెల్లడి కాగా, ఆ టేపుల్లో ఉన్న సంభాషణలను ఓ అంతర్జాతీయ పత్రిక ప్రచురించింది. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల వాతావరణం మాంచి జోరుగా ఉన్నవేళ కుటుంబ సభ్యుల వ్యాఖ్యలు ట్రంప్ ను కాస్త ఇబ్బందికి గురిచేయొచ్చని భావిస్తున్నారు.

మేరి లియా రాసిన పుస్తకాన్ని విడుదల కాకుండా అడ్డుకునేందుకు ట్రంప్ సోదరుడు రాబర్ట్ ప్రయత్నించినట్టు తెలిసింది. రాబర్ట్ ఇటీవలే మరణించారు. ట్రంప్ పై ఈ వ్యాఖ్యలు చేసిన ఆయన సోదరి మరియాన్నే బ్యారీ ఓ మాజీ న్యాయమూర్తి. ఇప్పటివరకు ఆమె ట్రంప్ పై ఎక్కడా బహిరంగ విమర్శలు చేయలేదు.


More Telugu News