ఉద్యమం చేస్తున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం తమాషా చూస్తోంది: చంద్రబాబు

  • అమరావతి పరిరక్షణ ఉద్యమానికి 250 రోజులు
  • దేశ చరిత్రలో ఇంత సుదీర్ఘ ఉద్యమాలు అరుదు
  • ఆందోళనకారుల బాధను వినడానికి ముందుకు రాని పాలకులు
  • తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపారు
రాజధాని అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం స్పందించడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. 'అమరావతి పరిరక్షణ ఉద్యమానికి 250 రోజులు. దేశ చరిత్రలో ఇంత సుదీర్ఘ ఉద్యమాలు అరుదు. ఇంత జరుగుతున్నా ఆందోళనకారుల బాధను వినడానికి ముందుకు రాని పాలకులు కూడా అరుదే. పైగా వేలాది మంది ఉద్యమకారులపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపింది' అని చంద్రబాబు అన్నారు.

'ఉద్యమంలో 85 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు అమరులైనా ప్రభుత్వం తమాషా చూస్తోంది. రాజధాని అంశంపై అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న మా డిమాండ్‌కు వైసీపీ ముందుకు రాలేదంటే,3 ముక్కల నిర్ణయానికి 13 జిల్లాల ప్రజల మద్దతు లేనట్టే. అలాంటప్పుడు మొండిగా ముందుకు పోవడం నిరంకుశత్వమే' అని ఆయన విమర్శలు గుప్పించారు.

'అమరావతి శంకుస్థాపనకు రాష్ట్రంలోని 13 వేల గ్రామాలు, 3 వేల వార్డుల్లో పవిత్ర మట్టి, పుణ్య జలాలు ప్రజలు ఊరేగింపుగా తెచ్చారంటేనే అమరావతిని రాజధానిగా అందరూ ఆమోదించారు. రాష్ట్రం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు అండగా ఉండాల్సిన బాధ్యత 13 జిల్లాల ప్రజలపై ఉంది' అని చంద్రబాబు అన్నారు.


More Telugu News