కాంగ్రెస్ అధ్యక్షుడి విషయంలో తొలగిపోనున్న ప్రతిష్ఠంభన.. రేపు సీడబ్ల్యూసీ కీలక భేటీ

  • సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న రాహుల్
  • రేపటి భేటీలో ప్రధానంగా అధ్యక్ష పదవిపైనే చర్చ
  • రాహుల్ వద్దంటున్న మరో వర్గం
కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్న తర్వాత నెలకొన్న ప్రతిష్ఠంభనకు రేపటితో తెరపడబోతున్నట్టు తెలుస్తోంది. సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కాబోతోంది. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడికి సంబంధించిన చర్చ జరగనున్నట్టు సమాచారం. అలాగే, పార్లమెంటు సమావేశాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైనా చర్చించనున్నట్టు తెలుస్తోంది.

గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. సీనియర్ నేతలు నచ్చజెప్పినప్పటికీ ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో సోనియా గాంధీ ఆ బాధ్యతలు చేపట్టారు. అయితే, 73 ఏళ్ల సోనియా వయోభారం కారణంగా ఆ బాధ్యతలను వేరొకరికి అప్పగించాలని నిర్ణయించారు. ఆ బాధ్యతలను తిరిగి రాహుల్‌కే అప్పగించాలన్న డిమాండ్ పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న సీడబ్ల్యూసీ భేటీలో ఈ విషయమై ఏదో ఒకటి తేల్చేయాలని సోనియా నిర్ణయించినట్టు తెలుస్తోంది.  

మరోవైపు కాంగ్రెస్‌లోని మరో గ్రూపు రాహుల్‌ వర్గాన్ని వ్యతిరేకిస్తోంది. రాహుల్ బృందంలోని సభ్యులకు రాజకీయ పరిపక్వత లేదని, వచ్చే ఎన్నికల్లో మోదీని ఢీకొట్టాలంటే మరో బలమైన నేత అవసరమని వాదిస్తోంది. దీంతో అధ్యక్ష పదవికి సోనియానే సరైన వ్యక్తని, ఆ బాధ్యతలు ఆమే చేపట్టాలని కోరుతోంది.


More Telugu News