మెరుపువేగంతో ఇంటర్నెట్... ఒక్క సెకనులో 1500 సినిమాల డౌన్ లోడ్!

  • లండన్ పరిశోధకుల అద్భుత ఘనత
  • సెకనుకు 178 టీబీ స్పీడ్ తో ఇంటర్నెట్
  • గత రికార్డు 44.2 టీబీపీఎస్
ఇంటర్నెట్ లేనిదే ప్రపంచం నడవదు అన్నట్టుగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో లండన్ పరిశోధకులు అద్భుతమైన పరిశోధన సాగించారు. హైస్పీడ్ ఇంటర్నెట్ దిశగా వారు చేసిన ప్రయోగాలు ఔరా అనిపిస్తాయి. ఇప్పటివరకు ఇంటర్నెట్ వేగంలో వరల్డ్ రికార్డు ఆస్ట్రేలియా పరిశోధకుల పేరిట ఉండేది. ఆస్ట్రేలియన్లు 44.2 టీబీపీఎస్ వేగం అందుకుంటే అప్పట్లో అందరూ విస్మయానికి లోనయ్యారు. కానీ ఇప్పుడు లండన్ యూనివర్సిటీ కాలేజ్ పరిశోధకులు సెకనుకు 178 టీబీ వేగం సాధించారు. సరిగ్గా చెప్పాలంటే ఒక్క సెకనులో 1.78 లక్షల జీబీ డేటా ప్రసారం అవుతుందన్నమాట!

లండన్ యూనివర్సిటీ కాలేజ్ కు చెందిన డాక్టర్ లిడియా గాల్డినో నేతృత్వంలో ఈ ఘనత సాధించారు. సాధారణంగా హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వినియోగిస్తారు. కానీ డాక్టర్ గాల్డినో బృందం తమ పరిశోధనల కోసం అధిక శ్రేణి కలిగిన తరంగ దైర్ఘ్యాలను వినియోగించి సఫలమయ్యారు.

లండన్ పరిశోధకులు సాధించిన ఇంటర్నెట్ వేగంతో సెకనుకు 1500 సినిమాలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అది కూడా హెచ్ డి సాంకేతికతను మించిన 4కే నాణ్యతతో కూడిన చిత్రాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చట. ప్రస్తుతం మనదేశంలో ఇంటర్నెట్ సగటు వేగం 2 ఎంబీపీఎస్ కాగా, లండన్ పరిశోధకులు సాధించిన వేగం మెరుపువేగం అని చెప్పాలి.


More Telugu News