బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు

  • ఇప్పటికే బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
  • అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం
  • ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలలో వర్షాలకు అవకాశం
బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం కొనసాగుతుండగా, రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ప్రస్తుతం తూర్పు మధ్యప్రదేశ్ మధ్య భాగం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే, వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.


More Telugu News