విచారణ ఎలా చేయాలో మాకు తెలుసు: హీరో రామ్ ట్వీట్లపై విజయవాడ సీపీ స్పందన

  • ఎవరో ఏదో అన్నారని దానిపై స్పందించను
  • రమేశ్ ఆసుపత్రి టాప్ మేనేజ్ మెంట్ వ్యక్తుల కోసం వెతుకుతున్నాం
  • పేషెంట్ల నుంచి అత్యధిక ఫీజులు వసూలు చేశారు
విజయవాడలోని స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదంపై సినీ హీరో రామ్ పోతినేని వరుస ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. అక్కడ రమేశ్ ఆసుపత్రి పెట్టకముందే ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్ ను నిర్వహించిందని రామ్ ట్వీట్ చేశారు. విచారణలో అసలైన వారిని వదిలేస్తున్నారని చెప్పారు. జగన్ గారూ మీ వెనుక కుట్ర జరుగుతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా కంటే కులం ప్రమాదకరమైనదని, వేగంగా విస్తరిస్తుందని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో విజయవాడ సీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ, పోలీసులకు కులం, మతం, రాజకీయ పార్టీలు అనేవి ఉండవని చెప్పారు. విచారణ ఎలా జరపాలో తమకు తెలుసని అన్నారు. ఎవరో ఏదో అన్నారని... దానిపై తాను స్పందించనని చెప్పారు. స్వర్ణ ప్యాలస్ లో క్వారంటైన్ సెంటర్ కాకుండా, కోవిడ్ కేర్ పేరుతో సెంటర్ ను నిర్వహించారని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఉంటే... అందరూ బతికేవారని చెప్పారు. తమకు సందేహం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారిస్తామని తెలిపారు.

ఈ కేసులోని ముద్దాయిలు, అనుమానితులు విచారణకు సహకరించడం లేదని శ్రీనివాస్ చెప్పారు. చికిత్స కోసం కరోనా పేషెంట్ల నుంచి అత్యధిక ఫీజులు వసూలు చేశారని తేలిందని తెలిపారు. ఈ కేసులో టాప్ మేనేజ్ మెంట్ వ్యక్తుల కోసం వెతుకుతున్నామని... వారికి సంబంధించిన సమాచారం ఇస్తే రూ. లక్ష బహుమతి ఇస్తామని చెప్పారు.


More Telugu News