ఫోన్ ట్యాపింగ్ ను అత్యాచారంతో పోల్చిన హోంమంత్రి సుచరిత తీరు దుర్మార్గం: అనిత

  • ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది
  • స్వార్థ ప్రయోజనాల కోసమే మూడు రాజధానుల నిర్ణయం
  • వైసీపీకి ఉత్తరాంధ్ర ప్రజలు బుద్ధి చెపుతారు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయిందని... అయినా, అసత్యాలు మాట్లాడుతోందని టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. ట్యాపింగ్ అంశాన్ని అత్యాచారంతో పోల్చిన హోంమంత్రి సుచరిత తీరు బాధాకరమని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కు ఆధారాలు చూపించాలంటున్న వైసీపీ నేతలు... టీడీపీ నేతలపై చేస్తున్న అవినీతి ఆరోపణలకు కూడా ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.

స్వార్థ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నారని అనిత ఆరోపించారు. అమరావతికి మరణశాసనం రాస్తున్నారని అన్నారు. వైసీపీ నేతల భూకబ్జాలు, అక్రమాలకు మాత్రమే విశాఖ రాజధాని అని చెప్పారు. చంద్రబాబు హయాంలో విశాఖకు వచ్చిన పరిశ్రమలను వైసీపీ ప్రభుత్వం వెళ్లగొడుతూ ఆ ప్రాంత అభివృద్ధిని నాశనం చేస్తోందని విమర్శించారు. జగన్ మెప్పు పొందడం కోసమే గుడివాడ అమర్నాథ్ వంటి నేతలు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు.

గతంలో విజయమ్మను విశాఖ ప్రజలు ఓడించినందుకే హుదూద్ తుపాను వచ్చిందని వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారని అనిత అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీకి బుద్ధి చెపుతారని వ్యాఖ్యానించారు. వైసీపీ కార్యాలయాలకు టూలెట్ బోర్డులు పెట్టుకునే రోజులు త్వరలోనే వస్తాయని అన్నారు.


More Telugu News