కమ్మ కులంలో పుట్టాలని మేము దేవుడిని కోరుకున్నామా?: టీడీపీ నేత రాజేంద్రప్రసాద్

  • వైయస్ వివేకా హత్య కేసులో ఇప్పటి వరకు ఏం చేశారు?
  • రమేశ్ ఆసుపత్రి విషయంలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు
  • మహిళలను కూడా పోలీస్ స్టేషన్లకు పిలిపిస్తున్నారు
వైయస్ వివేకానంద హత్య జరిగి చాలా కాలం గడిచి పోయిందని... జగన్ అధికారంలోకి వచ్చి ఏం చేశారని టీడీపీ నేత బాబు రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. రమేశ్ ఆసుపత్రి  వ్యవహారంలో 10 పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్న ప్రభుత్వం... వివేకా కేసు విషయంలో ఎందుకు సరిగా స్పందించలేదని అడిగారు.

 కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తున్నారని.. కమ్మ కులంలో పుట్టిన వారిని టార్గెట్ చేయడం సరికాదని అన్నారు. కమ్మ కులంలో పుట్టాలని మేము దేవుడిని కోరుకున్నామా? అని ప్రశ్నించారు. కమ్మ కులంలో పుట్టినందుకు బానిసలుగా బతకాలా? అని అడిగారు. రమేశ్ ఆసుపత్రి వ్యవహారంలో మహిళలు అని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లకు పిలిపించి విచారణ జరుపుతున్నారని రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు.

 ఇతర కేసుల విషయంలో ఇలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్ కేసులో తూతూ మంత్రంగా విచారణ జరిపించారని... పూర్తి స్థాయిలో సోదాలు ఎందుకు చేయలేదని అన్నారు. ప్రశాంత్ కిశోర్ వేసిన ఎత్తుగడలను అమలు చేసి జగన్ విజయవంతమయ్యారని చెప్పారు.


More Telugu News