ఇది జంధ్యాల, ఈవీవీ, బసు భట్టాచార్య సినిమాలను మించిన కామెడీ!: రఘురామకృష్ణరాజు

  • అభివృద్ధి వికేంద్రీకరణపై రఘురామ విసుర్లు
  • అభివృద్ధి కేంద్రీకరణ చేస్తున్నారంటూ వ్యాఖ్యలు
  • విశాఖ అన్ని విధాలా ఎదిగిందని వెల్లడి
  • విశాఖను పాడుచేయకుండా ఉంటే చాలన్న రఘురామ
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోమారు ఏపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. అమరావతి నుంచి రాజధానిని ఎందుకు మార్చాలని భావిస్తున్నారో చెప్పేందుకు అభివృద్ధి వికేంద్రీకరణ అనే టైటిల్ పెట్టారని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట, అభివృద్ధి చెందని ఉత్తరాంధ్రలో కార్యనిర్వాహక రాజధాని పెడతామంటున్నారని, అమరావతిలో ఉన్న అసెంబ్లీ భవనాలను అలాగే ఉంచుతామని చెబుతున్నారని, ఏమాత్రం కదపడానికి వీల్లేని హైకోర్టును కర్నూలు తీసుకెళతామని చెబుతున్నారని... దీనికి అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ అత్యద్భుతమైన టైటిల్ ఇచ్చారని వివరించారు.

"వాస్తవానికి దీనికి ఇవ్వాల్సిన సరైన టైటిల్ ఏంటంటే అభివృద్ధి కేంద్రీకరణ. ఎందుకంటే... విశాఖపట్నంలో మనకు లేనిదేమిటి? దేశంలోనే అత్యంత పెద్ద స్టీల్ ప్లాంట్ ఎక్కడుంది? విశాఖలోనే కదా. ప్రధాన పోర్టుల్లో ఒకటైన విశాఖ పోర్టు దేశంలోనే అత్యధిక ఎగుమతులు జరుపుతున్న పోర్టుగా పేరుగాంచింది. బీహెచ్ పీవీ ఉంది. ఇటీవలే అది బీహెచ్ఈఎల్ గా మారింది. గంగవరం పోర్టు కూడా దరిదాపుల్లోనే ఉంది. భోగాపురం ఎయిర్ పోర్టు సైతం సమీపంలోనే వస్తోంది.

అభివృద్ధికి నోచుకోలేదని చెబుతున్న ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లాలో దాదాపు రూ.3 వేల కోట్ల వ్యయంతో ఈ విమానాశ్రయం నిర్మాణం జరుపుకోనుంది. మరో వెనుకబడిన జిల్లాగా చెబుతున్న శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు వద్ద భారీ సీ పోర్టు వస్తోంది. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా అక్కడే ఉంది. చివరికి మా విజయసాయిరెడ్డి గారి బంధువులకు చెందిన ఫార్మా సంస్థ కూడా అక్కడే ఉంది. విశాఖలో ఐదు వందల ఎకరాల్లో హెటెరో డ్రగ్స్ సంస్థ ఉంది.

ఎంతో భారీ ఎత్తున అభివృద్ధి జరిగిన ప్రాంతం అది. దాన్ని మీరు చెడగొట్టకుండా ఉంటే సరి. మా మానాన మమ్మల్ని బతకనివ్వండి అని అక్కడ ప్రజలు మొత్తుకుంటున్నారు. ఇప్పుడు విశాఖ వెళ్లి మేం అభివృద్ధి చేస్తామనడం జంధ్యాల, ఈవీవీ, బసు భట్టాచార్య సినిమాలను మించిన కామెడీ చేసినట్టుగా ఉంటుంది. ఎంతో ఎదిగిన విశాఖ నగరాన్ని మీరు పాడుచెయ్యడం తప్ప అక్కడేమీ జరగదు.  ఇది విశాఖ ప్రజల తరఫు నుంచి ప్రభుత్వానికి చేస్తున్న విన్నపం.

దీనిపై నా ప్రియమిత్రుడు అవంతి శ్రీనివాస్ కు కోపం రావచ్చు... తోలు తీసేస్తానంటూ అనొచ్చు. ఎవరేమన్నా కూడా విశాఖ వాసుల మనోభావాలను చెబుతున్నా. అక్కడే ఆంధ్రా యూనివర్సిటీలో ఆరేళ్లు చదివాను. అప్పుడప్పుడు అక్కడికి వెళుతుంటాను. అక్కడి ప్రజల గురించి నాకు తెలుసు. వాళ్లు రౌడీయిజాన్ని ఇష్టపడరు. ఎంతో ప్రశాంతతను కోరుకునే వ్యక్తులు వాళ్లు. నిజంగా అభివృద్ధి వికేంద్రీకరణ మీద మీకు చిత్తశుద్ధి ఉంటే కదపడానికి వీల్లేని హైకోర్టును అమరావతిలోనే ఉంచి, లెజిస్లేచర్ క్యాపిటల్ ను వెనుకబడిన రాయలసీమలో మీకు ఇష్టమైన ప్రాంతంలో పెట్టండి. బెంగళూరుకు దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ మరిన్ని పరిశ్రమలు తీసుకురండి" అంటూ రఘురామకృష్ణరాజు హితవు పలికారు.


More Telugu News