ఇప్పటికీ మిమ్మల్ని ప్రతి రోజూ మిస్ అవుతున్నాము నాన్నా: తండ్రిని తలచుకున్న రాహుల్ గాంధీ

  • నేడు రాజీవ్ 76వ జయంతి
  • ట్విట్టర్ వేదికగా తలచుకున్న రాహుల్
  • నివాళులు అర్పించిన మోదీ
నేడు మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. "భవిష్యత్తు గురించి దూరాలోచన చేసిన నేత"గా ఆయన్ను అభివర్ణించిన రాహుల్, ఇప్పటికీ అటువంటి వ్యక్తిని మిస్ అవుతున్నామని అన్నారు.

"రాజీవ్ గాంధీ భావితరాల గురించి ఆలోచించిన వ్యక్తి. ఎంతో దూరదృష్టితో ఆలోచించారు. అన్నింటికన్నా మించి, సాటివారిపై ఎంతో ప్రేమను, అభిమానాన్ని కనబరిచే వ్యక్తి. ఆయన్ను తండ్రిగా పొందగలగడం నేను చేసుకున్న అదృష్టం, నాకెంతో గర్వకారణం. ఈ రోజు, ప్రతి రోజూ ఆయన్ను మిస్ అవుతూనే ఉంటాం" అని తన సోషల్ మీడియాలో రాహుల్ వ్యాఖ్యానించారు.

ప్రధాని నరేంద్ర మోదీ సైతం రాజీవ్ ను గుర్తు చేసుకుని నివాళులు అర్పించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు. కాగా,  1984లో ఆయన తల్లి ఇందిరా గాంధీ దారుణంగా హత్య చేయబడిన తరువాత, ఇండియాకు అతి చిన్న వయసులోనే... అంటే 40 ఏళ్లకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ,1991, మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూరులో ఎల్టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) ఆత్మాహుతి దాడిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. రాజీవ్ జన్మదినోత్సవాన్ని ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు.


More Telugu News