కరోనా వ్యాక్సిన్ యూఎస్ లో తప్పనిసరేమీ కాదు: అమెరికా ఆరోగ్య నిపుణుడు ఆంటోనీ ఫౌసీ

  • ముఖ్యమైన కొన్ని వర్గాలకే వ్యాక్సిన్ తప్పనిసరి
  • అందరూ తీసుకోవాల్సిన అవసరం లేదు
  • యూఎస్ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌసీ
అమెరికన్లు అందరికీ కరోనా వ్యాక్సిన్ తప్పనిసరేమీ కాదని, దీన్ని తీసుకోవాలని తామేమీ బలవంతం చేయబోమని, కావాలని భావించిన వారు తీసుకోవచ్చని యునైటెడ్ స్టేట్స్ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌసీ కీలక వ్యాఖ్యాలు చేశారు. కేవలం చిన్నారులు తదితర కొన్ని గ్రూపులకు మాత్రమే వ్యాక్సిన్ ను తప్పనిసరి చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

 "వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరేమీ కాదు. మేము దాన్ని ఎన్నటికీ రుద్దబోము. అందరూ వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు" అని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ నిర్వహించిన వీడియో టాక్ లో పాల్గొన్న ఫౌసీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వైట్ హౌస్ కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ లో సభ్యుడిగా కూడా ఉన్నారు.

హెల్త్ వర్కర్లు, చిన్నారులు, వృద్ధులు తదితరులకు వ్యాక్సిన్ ను అందిస్తామని, సాధారణ ప్రజలపై రుద్దబోమని ఆయన వ్యాఖ్యానించారు. తాము ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోకుండా ఆరోగ్య కార్యకర్తలు ఇతరులకు చికిత్స చేయరని, కరోనా వ్యాక్సిన్ విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తారని అన్నారు. కాగా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ మాత్రం ఇందుకు విరుద్ధమైన ప్రకటన చేయడం గమనార్హం. ఒకసారి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే, ఎటువంటి పరిమితులు లేకుండా ప్రతి ఒక్కరికీ దీన్ని తీసుకోవడం తప్పనిసరి చేస్తామని స్పష్టం చేశారు.


More Telugu News