ఆ నిధి ఖజానా శాఖ ఉద్యోగిదే: తేల్చేసిన పోలీసులు

  • మంగళవారం అర్ధరాత్రి వరకు నిధిని లెక్కించిన పోలీసులు
  • జిల్లా ఖజానా శాఖ సీనియర్ ఉద్యోగి మనోజ్‌కుమారే నిందితుడని తేల్చిన పోలీసులు
  • కేసును ఏసీబీకి బదిలీ చేసిన పోలీసులు
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని ఓ ఇంట్లో 8 ట్రంకుపెట్టెల్లో బయటపడిన బంగారు, వెండి ఆభరణాలు ఖజానా శాఖ ఉద్యోగివేనని పోలీసులు తేల్చారు. బుక్కరాయసముద్రానికి చెందిన డ్రైవర్ వద్ద ఖజానాశాఖలో పనిచేసే సీనియర్ అకౌంటెంట్ మనోజ్‌కుమార్ పెట్టెలు దాచిపెట్టాడన్న సమాచారంతో మంగళవారం అతడి ఇంటిపై పోలీసులు దాడిచేశారు.

 ఈ సందర్భంగా ట్రంకు పెట్టెల్లో దాచిపెట్టిన 2.42 కిలోల బంగారు ఆభరణాలు, 84.10 కిలోల వెండి ఆభరణాలు, రూ. 15,55,560 నగదు, రూ. 49.10 లక్షల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రూ. 27.05 లక్షల విలువైన బాండ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, రెండు కార్లు, 7 మోటారు సైకిళ్లు, 4 ట్రాక్టర్లు సీజ్ చేశారు. పోలీసులు సీజ్ చేసిన ద్విచక్ర వాహనాల్లో ఖరీదైన మూడు బైక్‌లు ఉన్నాయి. మూడు 9ఎంఎం పిస్టళ్లు, తూటాలు, ఒక ఎయిర్‌గన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే, అవి నకిలీవని తేల్చారు.

ఈ మొత్తం జిల్లా ఖజానా శాఖ ఉద్యోగి అయిన మనోజ్‌కుమార్‌దేనని, తన కారు డ్రైవర్ నాగలింగం మామ ఇంట్లో  పెట్టెలు దాచాడని పోలీసులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి వరకు వాటి విలువను లెక్కించినట్టు వివరించారు. ఓ జిల్లా ఖజానా శాఖ ఉద్యోగి ఇంత పెద్ద మొత్తం ఎలా సంపాదించాడన్న దానిపై దర్యాప్తు చేసేందుకు ఏసీబీకి కేసును ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్టు ఓఎస్డీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు.


More Telugu News