త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది: బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర 

  • సుశాంత్ కేసు విషయంలో మహా ప్రభుత్వం మొద్దునిద్రపోయింది
  • కేసును సీబీఐకి అప్పజెప్పడం మంచి పరిణామం
  • శివసేన అంటే నిద్రపోతున్న సేన అని అర్థం
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు విచారణను సీబీఐకి సుప్రీంకోర్టు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం రాజకీయాల్లో సైతం దుమారం రేపుతోంది. బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఇదే సమయంలో మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

సుశాంత్ కేసు విషయంలో ఇప్పటి వరకు మొద్దునిద్రపోయిన మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గగ్గోలు పెడుతోందని సంబిత్ విమర్శించారు. సుశాంత్ కుటుంబంపై శివసేన ఎంపీ విమర్శలకు దిగారని అన్నారు. త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఇంటిదారి పట్టిందనే వార్తను మనందరం వింటామని జోస్యం చెప్పారు. శివసేన అంటే నిద్రపోతున్న సేన అని ఎద్దేవా చేశారు. సుశాంత్ మరణంలో అసలు నిజాలు సీబీఐ విచారణలో వెలుగులోకి వస్తాయని చెప్పారు. సుప్రీం తీర్పుతో మహారాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద దెబ్బ తగిలిందని అన్నారు.


More Telugu News