వర్మ 'మర్డర్' సినిమాపై నల్గొండ కోర్టులో విచారణ పూర్తి!
- అమృత, ప్రణయ్ ల ప్రేమకథతో 'మర్డర్' సినిమా
- సినిమాను ఆపేయాలంటూ అమృత పిటిషన్
- 24వ తేదీన తీర్పును వెలువరించనున్న కోర్టు
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం 'మర్డర్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అమృత, ప్రణయ్ ల ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఆపేయాలంటూ గత నెల 29న నల్గొండ కోర్టులో అమృత ప్రైవేట్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను నల్గొండ కోర్టు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసింది. ఇప్పటికే ఈ కేసు విచారణ పలుమార్లు వాయిదా పడింది. గత నెల 14వ తేదీన విచారణ జరిపిన కోర్టు ఈరోజుకు వాయిదా వేసింది. ఈరోజు ఇరుపక్షాల వాదనను విన్న కోర్టు... తీర్పును ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో, కోర్టు ఎలాంటి తీర్పును వెలువరించనుందో అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.