కరోనా బారినపడి కోలుకున్న ‘వదినమ్మ’ నటి శివపార్వతి.. నటుడు ప్రభాకర్‌పై సంచలన వ్యాఖ్యలు

  • కరోనా నుంచి కోలుకుని గత రాత్రి ఇంటికి చేరుకున్న నటి
  • జీవిత రాజశేఖర్ వచ్చి పరామర్శించి సాయం చేశారన్న శివపార్వతి
  • ప్రభాకర్ నుంచి తాను ఎక్కువగా ఆశించడం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు
బుల్లితెర ప్రముఖ నటి, ‘వదినమ్మ’ ఫేం శివపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆమె కోలుకుని నిన్న రాత్రే ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న పది రోజులు తాను అనుభవించిన మానసిక సంఘర్షణకు సంబంధించి ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో ‘వదినమ్మ’ యూనిట్‌పైనా, ఆ సీరియల్‌ను నిర్మిస్తూ, నటిస్తున్న ప్రభాకర్‌పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కరోనా బారినపడి రెండు ఆసుపత్రులు మారిన విషయం ప్రభాకర్‌కు, యూనిట్‌కు తెలుసని, కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా తన గురించి పట్టించుకోలేదని, కనీసం ఎక్కడ ఉన్నాను? ఎలా ఉన్నానన్న విషయం గురించి కూడా ఎవరూ అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయంలో తాను ఎవరినీ తప్పుబట్టాలనుకోవడం లేదని, పైపెచ్చు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానని పేర్కొన్నారు.

తనకు కనుక ఈ పరిస్థితి రాకుంటే ఎవరెలాంటివారన్న విషయం తెలిసేది కాదని శివపార్వతి తెలిపారు. ఎంత పెద్ద ఆర్టిస్టు అయినా ప్రాణం ఒకటేనని, ఆపద కూడా ఒకటేనని పేర్కొన్న ఆమె.. కరోనా వైరస్ అనేది చిన్న విషయం కాదన్న విషయం మొత్తం ప్రపంచానికి తెలుసన్నారు. ఆర్టిస్టుల మధ్య ఓ అనుబంధం ఉంటుందని, కలిసి పనిచేస్తున్నప్పుడు అది మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.

ఇండస్ట్రీలో ఎవరికి ఎవరూ తోడుండరని, ప్రభాకర్ నుంచి తానేమీ పెద్దగా ఆశించడం లేదని అన్నారు. తాము కూడా అలాగే ఉండాలని, నటించి అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే ఆ మనుషులను అక్కడితో మర్చిపోవాలని అన్నారు. మనుషుల మధ్య సంబంధాలు అలా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పోయిన తర్వాత కూడా ఇలాగే స్పందిస్తారేమోనని, ఎవరికీ తెలియనివ్వకుండా సైలెంట్‌గా సీరియల్ చిత్రీకరణ జరుపుతారని అన్నారు.

ఆర్టిస్టుల పట్ల ప్రేమ పంచితే చనిపోతారనుకున్న వారికి కూడా బలం వస్తుందని, ఈ విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. తాను ఐదేళ్ల నుంచి సినిమాలు చేయకపోయినా జీవితా రాజశేఖర్ ఆసుపత్రికి వచ్చి తన పరిస్థితి తెలుసుకుని సాయం చేశారని శివపార్వతి చెప్పుకొచ్చారు.


More Telugu News