సుశాంత్ సింగ్‌ కేసులో కీలక పరిణామం.. సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం

  • సీబీఐకి అప్పగించాలని ఇటీవల బీహార్‌ ప్రభుత్వం సిఫారసు
  • సీబీఐకి అప్పగిస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం ప్రకటన
  • వ్యతిరేకించిన మహారాష్ట్ర ప్రభుత్వం
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. బీహార్, మహారాష్ట్ర పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలో సమన్వయం, సహకారం లేకపోవడం కూడా విమర్శలకు తావిచ్చింది.  ఈ కేసును కేంద్ర దర్యాప్తు బృందం ( సీబీఐ)కి అప్పగించాలని బీహార్‌ ప్రభుత్వం ఇప్పటికే సిఫారసు చేసింది.

అంతేగాక, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం కూడా తెలిపింది. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సీబీఐ విచార‌ణ అంశంపై ఈ రోజు సుప్రీం కోర్టు తమ నిర్ణయాన్ని తెలిపింది.

ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులకు ఆదేశించింది. కాగా, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తోన్న బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టు నిర్ణయంపై స్పందిస్తూ... 'సీబీఐ జయహో' అంటూ ట్వీట్ చేశారు.


More Telugu News