అక్కడ నిహారిక మిస్సవడంతో ఆ బాధలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: నాగబాబు చెప్పిన ఆసక్తికర ఘటన

  • 'ఆరంజ్' విషయంలో సూసైడ్ కు యత్నించానని గతంలో చెప్పిన నాగబాబు
  • నిహారిక విషయంలోనూ అలాగే ఆలోచించానని తాజాగా వెల్లడి
  • న్యూజిలాండ్ ఘటనను గుర్తు చేసుకున్న నాగబాబు
రామ్ చరణ్ తో తాను నిర్మించిన 'ఆరంజ్' చిత్రం డిజాస్టర్ కావడంతో వచ్చిన నష్టాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించానని గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన మెగా బ్రదర్ నాగబాబు, తాజాగా, ఓ టీవీ చానెల్ ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇంకోసారి కూడా తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు చెప్పారు. అదెప్పుడు జరిగిందన్న విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు.

ఆ ఘటనకు సంబంధించిన వివరాలు ఏంటంటే... నాగబాబు ఓ మారు ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో నాగబాబు వేసుకున్న దుస్తుల మాదిరిగానే ఉన్న మరో వ్యక్తిని తండ్రే అనుకుని అతనితో నిహారిక వెళ్లిపోయింది. నిహారిక కనిపించడం లేదని తెలియడంతో 20 నిమిషాల పాటు వెతికిన నాగబాబు, ఆపై ఆందోళన చెందుతూ, ఆ దేశంలో ఉన్న వాళ్లందరినీ చంపేయాలన్నంత కోపంతో ఊగిపోయారు.

పాప కనిపించని మనస్తాపంతో, వరుణ్ బాబును మాత్రం ఇంటికి పంపేసి, భార్యతో కలిసి సూసైడ్ చేసుకోవాలని అనుకున్నారు. ఆ తరువాత నిహారిక కనిపించిందనుకోండి. ఎంతో పుణ్యం చేసుకుంటేనే నిహారిక వంటి ఏంజల్స్ జన్మిస్తారని, తనకు ఆమె అంటే ఎంతో ఇష్టమని ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 


More Telugu News