ఇటీవలి అల్లర్లపై సీబీఐతో విచారణ జరిపించండి.. కర్ణాటక సీఎంను కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

  • వారం రోజుల క్రితం శ్రీనివాసమూర్తి ఇంటిపై ఆందోళనకారుల దాడి
  • యడియూరప్పను కలిసిన ఎమ్మెల్యే
  • నిందితులను విడిచిపెట్టబోమన్న సీఎం
కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి నిన్న ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను కలిశారు. ఈ సందర్భంగా వారం రోజుల క్రితం బెంగళూరులో జరిగిన అల్లర్లలో ఆందోళనకారులు తన ఇంటిని విధ్వంసం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఈ సందర్భంగా సీఎంను కోరారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇటువంటి ఘటనలను ఉపేక్షించబోమని, అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నిందితుల ఆస్తులు స్వాధీనం చేసుకుని వారి నుంచి పరిహారం రాబట్టనున్నట్టు చెప్పారు.  

కాగా, అల్లర్లు జరిగిన డీజేహళ్లి, కేజీహళ్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో విధించిన 144 సెక్షన్‌ను నేటి ఉదయం వరకు పొడిగించారు. అయినప్పటికీ ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అలానే ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు, కేసులో పోలీసులు ఇప్పటి వరకు 340 మందిని అరెస్ట్ చేశారు.


More Telugu News