కరోనా వ్యాక్సిన్ ధర నుంచి ఉత్పత్తి వరకూ... కేంద్రానికి వివరాలు వెల్లడించిన ఫార్మా కంపెనీలు!

  • వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ పై కమిటీ
  • కమిటీతో సమావేశమైన ఫార్మా కంపెనీలు
  • పాల్గొన్న భారత్ బయోటెక్, జైడస్ కాడిలా, సీరమ్ తదితరాలు
  • వ్యాక్సిన్ సిద్ధమైతే తయారీకి ప్రభుత్వ సాయం
ఇండియాలో కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన ఐదు ఫార్మా కంపెనీలు, జాతీయ నిపుణుల కమిటీతో సమావేశమై, పురోగతిని వివరించాయి. వ్యాక్సిన్ వస్తే, దాని ధర ఎంతవరకూ ఉంటుంది? ఎన్ని రోజుల్లో ఎన్ని డోస్ లను ఉత్పత్తి చేయగలుగుతాం? అనే విషయాలపై ఈ సంస్థలు వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ పై ఏర్పాటు చేసిన కమిటీకి సమాచారాన్ని అందించాయి.

ప్రస్తుతం ఇండియాలో భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ ను, జైడస్ కాడిలా సంస్థ జైకోవిడ్ ను తయారు చేస్తుండగా, ఇవి రెండూ పూర్తి స్వదేశీ వ్యాక్సిన్ లు. ఇదే సమయంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికాలు తయారు చేసిన వ్యాక్సిన్ ను అందించనుంది. ఈ మూడింటితో పాటు బయోలాజికల్ ఈ, జెన్నోవా బయో ఫార్మాస్యుటికల్స్ కంపెనీలు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నాయి.

ఈ కంపెనీలకు కేంద్రం తరఫున ఏదైనా సహాయం అవసరమైతే చేసేందుకు సిద్ధమేనని కమిటీ హామీ ఇచ్చింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే, ప్రొడక్షన్ కెపాసిటీని పెంచేందుకు సాయం చేస్తామని పేర్కొంది. కాగా, ఇదే కమిటీ అంతకుముందు వ్యాక్సిన్ పంపిణీ విషయమై డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, విదేశాంగ, బయో టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రతినిధులతో పాటు ఎయిడ్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, ఐసీఎంఆర్, వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖల ప్రతినిధులు కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

గత శనివారం నాడు నరేంద్ర మోదీ మాట్లాడుతూ, మన శాస్త్రవేత్తల నుంచి వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ వస్తే, త్వరితగతిన దేశ ప్రజలందరికీ అందించేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోవాగ్జిన్ తొలి దశ ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకుని, రెండో దశలోకి అడుగు పెట్టగా, మరో దేశవాళీ వ్యాక్సిన్ జైకోవిడ్ ఈ నెల 6 నుంచి రెండో దశ ట్రయల్స్ ప్రారంభించింది.



More Telugu News