ప్రముఖ సంగీత విద్వాంసుడు పండిట్ జస్రాజ్ కన్నుమూత

  • అమెరికాలోని న్యూజెర్సీలో కన్నుమూత
  • 8 దశాబ్దాలపాటు సాగిన సంగీత ప్రస్థానం
  • భారత సాంస్కృతిక రంగానికి తీరని లోటన్న రాష్ట్రపతి, ప్రధాని
దాదాపు 80 ఏళ్లుగా గాయకుడిగా, సంగీత గురువుగా శాస్త్రీయ సంగీతానికి విశేష సేవలు అందించిన విద్వాంసుడు పండిట్ జస్రాజ్ (90) నిన్న కన్నుమూశారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఆయన కార్డియాక్ అరెస్ట్‌తో తుదిశ్వాస విడిచినట్టు జస్రాజ్ కుమార్తె దుర్గా జస్రాజ్ తెలిపారు. హరియాణాలోని హిస్సార్ ప్రాంతానికి చెందిన జస్రాజ్ 28 జనవరి 1930న జన్మించారు.

శాస్త్రీయ సంగీత ఝరిలో కోట్లాదిమంది ప్రజలను ఓలలాడించిన పండిట్ జస్రాజ్.. ఎంతోమంది సంగీత కళాకారులు, గాయకులను ఈ దేశానికి అందించారు. ప్రముఖ సంగీత కళాకారులైన సంజీవ్ అభయంకర్, సుమన్ ఘోష్, తృప్తి ముఖర్జీ, కళా రామనాథ్, బాలీవుడ్ గాయని సాధనా సర్గమ్ వంటి వారు ఆయన శిష్యులే.

జస్రాజ్ మృతికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మంత్రి రవిశంకర్ ప్రసాద్ తదితరులు సంతాపం తెలిపారు. ఆయన మృతి భారత సాంస్కృతిక రంగానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. కాగా, పండిట్ జస్రాజ్ సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి పౌరపురస్కారాలతో సత్కరించింది.


More Telugu News