వరద సహాయ చర్యల పర్యవేక్షణకు కేసీఆర్ స్వయంగా వెళ్లాలి: రేవంత్ రెడ్డి

  • వరద గుప్పిట్లో చిక్కుకున్న వరంగల్
  • ఫాంహౌస్ లో ఉండి తూతూ మంత్రం సమీక్షలు వద్దన్న రేవంత్
  • సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరగాలని సూచన
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు వరద పరిస్థితులు సృష్టించాయి. అనేక జిల్లాలు ముంపు బారినపడ్డాయి. వరంగల్ నగరం భారీ వరదతో నీట మునిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సహాయక చర్యలపై స్పందించారు.

చారిత్రక నగరం వరంగల్ కనీవినీ ఎరుగని కన్నీటి సంద్రమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫాంహౌస్ లో కూర్చుని తూతూ మంత్రపు సమీక్షలు చేయడం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని హితవు పలికారు. సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి వరద సహాయ, పునరావాస చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.

ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఓరుగల్లు నగరం జలమయమైంది. వాహనాలు కూడా మునిగిపోయేంత స్థాయిలో కాలనీల్లోకి వరద నీరు ప్రవేశించింది. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి.


More Telugu News