ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు... గత 24 గంటల్లో 6,780 కేసుల నమోదు

  • మొత్తం కేసుల సంఖ్య 2,96,609 
  • 82 మంది మృతి
  • అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 13 మంది మృత్యువాత
ఏపీలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. కొన్నిరోజుల కిందటి వరకు పది వేలకు పైగా కేసులు వస్తుండడంతో అధికార వర్గాలు బెంబేలెత్తిపోయాయి. అయితే, రెండ్రోజుల నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య పది వేలకు దిగువన నమోదవుతోంది. తాజాగా 6,780 కరోనా కేసులు వెల్లడయ్యాయి. జిల్లాల్లోనూ కొద్దిమేర ఉద్ధృతి తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. తూర్పు గోదావరి (911) జిల్లాలో వెయ్యికి దరిదాపుల్లో కొత్త కేసులు వచ్చినా మిగిలిన జిల్లాల్లో సాధారణ స్థాయిలో కేసులు నమోదయ్యాయి.

ఇక మరణాల సంగతి చూస్తే... జిల్లాల్లో మృత్యుఘంటికలు మోగుతున్నట్టే భావించాలి. గడచిన 24 గంటల్లో 82 మంది మృత్యువాత పడ్డారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 13 మంది మరణించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 2,732కి పెరిగింది. ఇప్పటివరకు వచ్చిన పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,609 కాగా, కొత్తగా 7,866 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తమ్మీద 2,09,100 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు.


More Telugu News