హైదరాబాదు ఆసుపత్రిలో బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ కామత్ కన్నుమూత

హైదరాబాదు ఆసుపత్రిలో బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ కామత్ కన్నుమూత
  • కొంతకాలంగా కాలేయవ్యాధితో బాధపడుతున్న నిషికాంత్
  • కామెర్లకు చికిత్స కోసం జూలై 31న ఏఐజీ ఆసుపత్రిలో చేరిక
  • పరిస్థితి విషమించడంతో మృతి
బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ కామత్ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 50 సంవత్సరాలు. ఆయన మరణానికి దీర్ఘకాలిక కాలేయ వ్యాధి కారణమని భావిస్తున్నారు. నిషికాంత్ గత కొన్నిరోజులుగా హైదరాబాదులోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కామెర్ల వ్యాధితో బాధపడుతున్న ఆయనను జూలై 31న ఆసుపత్రికి తీసుకువచ్చారు.

ఈ ఉదయం ఆయన పరిస్థితి విషమంగా ఉందంటూ ఏఐజీ వర్గాలు తమ బులెటిన్ లో పేర్కొన్నాయి. ఆ తర్వాత ఆయన మరణించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ ప్రచారాన్ని బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ ముఖ్ ఖండించారు. కానీ, కొద్దిసేపటి క్రితం నిషికాంత్ కన్నుమూశారంటూ స్వయంగా రితేశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

నిషికాంత్ బాలీవుడ్ లో ఎంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆయన 2005లో వచ్చిన డోంబీవాలీ ఫాస్ట్ అనే మరాఠీ సినిమా ద్వారా కెరీర్ ఆరంభించారు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత మలయాళంతో పాటు అనేక భాషల్లో హిట్టయిన దృశ్యం చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేశారు. నిషికాంత్ కు దర్శకత్వంలోనే కాదు నటనలోనూ ప్రవేశం ఉంది. ఆయన హవా ఆనే దే, రాకీ హ్యాండ్సమ్ అనే హిందీ చిత్రాలతో పాటు ఓ మరాఠీ సినిమాలోనూ నటించారు. నిషికాంత్ మరణం పట్ల బాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.


More Telugu News