రష్యా వ్యాక్సిన్ ఆవిష్కరణ నేపథ్యంలో.. ఇతర దేశాల శాస్త్రవేత్తలపై ప్రభుత్వాల ఒత్తిడి!

  • 11న వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేసిన రష్యా
  • శాస్త్రవేత్తలపై ఒత్తిడి పెడుతున్న యూఎస్
  • అదే దారిలో చైనా సహా పలు దేశాలు
  • ప్రమాదకరమంటున్న వ్యాక్సిన్ నిపుణులు
ప్రపంచంలోనే కరోనాకు తొలి వ్యాక్సిన్ గా, రష్యా 'స్పుత్నిక్ వీ'ని రిజిస్టర్ చేసిన తరువాత, వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయని భావిస్తున్న దేశాల్లో శాస్త్రవేత్తలపై ఒత్తిడి పెరిగినట్టు తెలుస్తోంది. తాము వ్యాక్సిన్ ను తయారు చేశామని ప్రకటించుకున్న రష్యా చర్యను గర్హించలేని పలు దేశాలు, సాధ్యమైనంత త్వరలో వ్యాక్సిన్ ను బయటకు ఇవ్వాలని తయారీ సంస్థలను తొందర పెడుతున్నట్టు సమాచారం. తమ వ్యాక్సిన్ సమర్థతపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా, ఇప్పటికే అక్టోబర్ నుంచి వ్యాక్సిన్ ను భారీ ఎత్తున తయారు చేసేందుకు రష్యా సిద్ధమైంది.

రష్యా పరుగులతో ఇతర దేశాల్లోనూ ప్రభుత్వాలు వ్యాక్సిన్ పరీక్షల్లో వేగాన్ని పెంచాలని శాస్త్రవేత్తలపై ఒత్తిడిని తెచ్చే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యా వ్యాక్సిన్ విషయంలో ఏదైనా తేడా వస్తే, అన్ని వ్యాక్సిన్ ల భద్రతపైనా నీలినీడలు ఏర్పడతాయని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 7.50 లక్షల మందికి పైగా బలిగొనగా, శాస్త్రవేత్తలపై అధిక ఒత్తిడి పెడుతున్న దేశాల్లో అమెరికా కూడా ఉంది. ఇప్పటికే దేశాధ్యక్షుడు ట్రంప్, నవంబర్ తొలివారంలోనే వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించేశారు. చైనా కూడా అదే విధమైన నిర్ణయంతో ఉన్నట్టు సమాచారం. ఆగస్టు 11న రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన వెలువడిన తరువాత, చైనా ప్రభుత్వం సైతం, వ్యాక్సిన్ ను విడుదల చేసేయాలని శాస్త్రవేత్తలను ఆదేశించినట్టు తెలుస్తోంది.

పరిమితమైన సాక్ష్యాలతో వ్యాక్సిన్ ను బయటకు తేవడం, భవిష్యత్తులో ఎన్నో ప్రమాదాలను కొనితెస్తుందని ఫిలడెల్ఫియా వ్యాక్సిన్ ఎడ్యుకేషన్ సెంటర్ డైరెక్టర్ పౌల్ ఆఫిట్ అభిప్రాయపడ్డారు. క్లిష్ట పరిస్థితులు ఎదురైన వేళ, నాయకులు, ప్రజలను సంతోష పెట్టే ప్రయత్నాలు చేయడం సాధారణమేనని, ఇదే సమయంలో చేసిన ప్రయోగాలు చాలని, వెంటనే వ్యాక్సిన్ ఇవ్వాలని ఆదేశించడం మాత్రం ప్రమాదకరమని ఆయన అన్నారు. ప్రజలను కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని సూచించారు. ఓ వ్యాక్సిన్ ను అనుమతించాలంటే, ఎంతో శ్రమించాల్సి వుంటుందని ప్రపంచ చరిత్ర చెబుతోందని గుర్తు చేసిన ఆయన, ఈ విషయంలో చిన్న తప్పు జరిగినా, ప్రజల్లో ఉన్న రోగ నిరోధక శక్తి నశించి, కొత్త ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు.


More Telugu News