విజయనగరం ప్రాంతంలో ఆన్ లైన్ ద్వారా విటులకు వల... 3 వేల మందికి టోకరా!

  • స్నేహితురాలితో కలిసి డబ్బు కోసం వివాహితుడి ప్లాన్
  • రూ. 8,500 వేయబోయి రూ. 85 వేలు వేసిన ఎన్నారై
  • పోలీసులకు ఫిర్యాదుతో మొత్తం వ్యవహారం బట్టబయలు
ఆన్ లైన్ సెక్స్ పేరిట వ్యాపారం చేస్తూ, దాదాపు 3 వేల మందిని నిండా ముంచేసిన జంటను విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, అమెరికా నుంచి వచ్చిన ఓ యువకుడు, అమ్మాయి కోసం వెతికి,రూ. 8,500కు బేరం ఆడుకుని, అందుకు బదులుగా పొరపాటున రూ.85 వేలు పంపాడు. ఆపై ఆ ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో, తాను మోసపోయానని భావించి, పోలీసులను ఆశ్రయించాడు.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పలు విస్తుపోయే విషయాలను వెలుగులోకి తెచ్చారు. చానాళ్ల క్రితం విజయనగరానికి వచ్చి, రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించిన అశ్విన్ అనే వ్యక్తికి, సింధు అనే యువతితో సంబంధం ఏర్పడింది. అప్పటికే పెళ్లయి, పిల్లలున్న అశ్విన్ కు రెండు సంసారాలను నిర్వహించడం భారం కావడంతో, సింధుతో కలిసి ప్లాన్ చేశాడు.

దీంతో లోకాంటో వెబ్ సైట్ సాయంతో ఆన్ లైన్ సెక్స్ వ్యాపారంలోకి దిగాడు. అతను పెట్టే పోస్టులను చూసిన ఎవరైనా సంప్రదిస్తే, వారితో మాటలు కలిపి, వారి స్తోమతను అంచనా వేసేవాడు. ఆపై సింధుతో మాట్లాడించి, రూ. 500 నుంచి రూ. 8 వేల వరకూ వసూలు చేసేవాడు. ఎవరైనా డబ్బులు వేయగానే ఫోన్ స్విచ్చాఫ్ చేసేవాడు. తాము పోగొట్టుకున్నది తక్కువ మొత్తమే కావడంతో ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

నెలకు దాదాపు రూ. 25 వేల చొప్పున నాలుగేళ్ల నుంచి అశ్విన్ ఇదే పనిగా బతికేశాడు. ఇలా మొత్తం మూడువేల మందిని మోసం చేశాడు. గత వారంలో యూఎస్ నుంచి వచ్చిన ఓ యువకుడి ఫిర్యాదుతో, స్పందించిన పోలీసులు, అశ్విన్ ను, అతని ప్రేయసి సింధును అరెస్ట్ చేశారు. అశ్విన్ ఎన్నో నంబర్లను మార్చాడని, పోలీసు అధికారులు తెలిపారు.


More Telugu News