కరోనా ఫలితం రావడానికి ముందే ఘనంగా పెళ్లి.. వైరస్ నిర్ధారణ కావడంతో వందలాది మందిలో ఆందోళన!

  • విశాఖపట్టణం జిల్లాలో ఘటన
  • రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన యువకుడు
  • పెళ్లి అనంతరం 500 మందికి విందు
‌కరోనా పరీక్ష చేయించుకున్నా, ఫలితం రాకముందే పెళ్లి చేసుకున్న ఓ యువకుడు దాదాపు 600 మందిని భయభ్రాంతుల్లోకి నెట్టేశాడు. విశాఖపట్టణం జిల్లాలోని కోటవురట్ల మండలం కొడవటిపూడి గ్రామంలో జరిగిందీ ఘటన.

గ్రామానికి చెందిన యువకుడు (31) 20 రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా నుంచి గ్రామానికి వచ్చాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ నెల 5న పరీక్షలు చేయించుకున్నాడు. అయితే, ఫలితం రావడాని కంటే ముందే ఈ నెల 15న రావికమతం గ్రామానికి చెందిన యువతిని చర్చిలో వివాహం చేసుకున్నాడు.

ఈ పెళ్లికి ఇరువైపుల కుటుంబ సభ్యులు, బంధువులు దాదాపు 90 మంది పాల్గొన్నారు.  అదే రోజు మధ్యాహ్నం ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన విందులో 500 మంది వరకు పాల్గొన్నారు. కాగా, ఆదివారం పరీక్ష ఫలితాలు రాగా, అతనికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఈ విషయం ఒక్కసారిగా గుప్పుమనడంతో, పెళ్లిలో పాల్గొన్న బంధువులతోపాటు విందుకు హాజరైన 500 మందిలో కలవరం మొదలైంది.


More Telugu News