గుండెపోటుతో కన్నుమూసిన చెన్నై '5 రూపాయల డాక్టర్'!

  • ఈ నెల 13న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక
  • ఐదు రూపాయల వైద్యుడిగా 45 ఏళ్లపాటు సేవలు
  • సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం దిగ్భ్రాంతి
ఐదు రూపాయల వైద్యుడిగా చెన్నై వాసులకు చిరపరిచితుడైన తిరువేంగడం (70) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. ఉత్తర చెన్నై పరిధిలోని వ్యాసార్పాడి ఎరుకంచ్చేరి వి కల్యాణపురంలో దాదాపు 45 ఏళ్లపాటు ఆయన ఐదు రూపాయలకే సేవలు అందించారు. తొలుత రెండు రూపాయలు తీసుకునే ఆయన రోగుల ఒత్తిడి మేరకు ఫీజును 5 రూపాయలు చేశారు. ఆ మొత్తాన్ని కూడా మందులు కొనుగోలు చేసుకోలేని స్థితిలో ఉన్న పేదల కోసం ఖర్చు చేసేవారు. కేన్సర్‌తో బాధపడుతున్న పేద రోగులకు కూడా తిరువేంగడం సేవలు అందించారు.

ఈ 13న తిరువేంగడం చాతీలో నొప్పితో ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూనే శనివారం కన్నుమూశారు. ఆయన మృతి విషయం తెలిసి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు. పేదలకు ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


More Telugu News