మాన్సాస్ పరిధిలోని ఉద్యోగులు వీధుల్లో భిక్షాటన చేయడం అందరినీ కలచివేస్తోంది: నారా లోకేశ్

  • మాన్సాస్ ట్రస్టు నేపథ్యంలో లోకేశ్ విమర్శలు
  • క్షుద్రరాజకీయాలు చేస్తున్నారంటూ వ్యాఖ్యలు
  • ఉద్యోగులకు జీతాలు ఇవ్వరా? అంటూ ఆగ్రహం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాన్సాస్ ట్రస్టు నేపథ్యంలో సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ఎంతోమందికి విద్య, విజ్ఞానం, కళలు, సంస్కృతిని పెంపొందించిన విజయనగరం పూసపాటి వంశీయుల మహారాజ పోషణ సంస్థానం మాన్సాస్ అని వివరించారు. అంతటి గొప్ప సంస్థను సర్కారు తమ కుతంత్ర రాజకీయాలకు వేదికగా చేసుకోవడం విచారకరం అని పేర్కొన్నారు. ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిపై కక్ష తీర్చుకోవడానికి మాన్సాస్ పరిధిలోని భూములు, ఆస్తుల కోసం ట్రస్ట్ ను జగన్ రెడ్డి చెరబట్టారని విమర్శించారు. మాన్సాస్ ట్రస్టును అడ్డంపెట్టుకుని క్షుద్రరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

"ఈ ట్రస్టు పరిధిలో దేవాలయాలు, విద్యాసంస్థలు లెక్కలేనన్ని ఉన్నాయి. అశోక్ గజపతిని చైర్మన్ గా జగన్ రెడ్డి తొలగించినప్పటి నుంచి ఆ సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలేదు. 5 నెలలుగా జీతాలు ఇవ్వడంలేదని నాన్ టీచింగ్ స్టాఫ్ విజయనగరం వీధుల్లో భిక్షాటన చేయడం అందరినీ కలచివేస్తోంది. వారు కుటుంబాలతో సహా రోడ్డునపడడానికి కారణం జగన్ రెడ్డి ప్రభుత్వమే.

భూములు కొట్టేసేందుకు, పదవులు అలంకరించేందుకు మాన్సాస్ ట్రస్టు కావాలా? అందులో పనిచేసే ఉద్యోగులకు మాత్రం జీతాలు ఇవ్వరా? ఇదేం న్యాయం?" అంటూ లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మాన్సాస్ ఉద్యోగులపై ఓ మీడియా చానల్ లో వచ్చిన కథనాన్ని కూడా లోకేశ్ ట్విట్టర్ లో పంచుకున్నారు.



More Telugu News