నా తల్లి శ్యామల 19 ఏళ్ల వయసులో కాలిఫోర్నియాలో విమానం దిగారు: కమలా హారిస్

  • అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్
  • భారతీయ మూలాలను స్మరించుకున్న కమలా
  • బాల్యంలో తల్లి వెంట భారత్ వచ్చేదాన్నని వెల్లడి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్న భారత సంతతి మహిళ కమలా హారిస్ పేరు మార్మోగిపోతోంది. అమెరికాలోని భారతీయ సమాజంలోనే కాదు, భారతదేశంలోనూ కమలా హారిస్ ఇప్పుడో చర్చనీయాంశంగా మారారు. ఆమె గురించిన వివరాలు తెలుసుకునేందుకు ఎక్కువ ఆసక్తిచూపుతున్నారనడం అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో కమలా హారిస్ తన భారత మూలాలను జ్ఞాపకం చేసుకున్నారు.

తన తల్లి శ్యామల పందొమ్మిదేళ్ల వయసులో అమెరికాలో అడుగుపెట్టిందని, కాలిఫోర్నియాలో విమానం దిగిన ఆమె వెంట నాడు పెద్దగా వస్తువులేవీ లేవని తెలిపారు. అయితే, భారత్ లోని తన ఇంటి నుంచి అనేక విలువైన జీవిత పాఠాలను తీసుకువచ్చారని, ఆ పాఠాల్లో ఆమె తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నవి కూడా ఉన్నాయని అన్నారు. తాము భారత మూలాలను మర్చిపోకుండా ఉండేందుకు తమను తల్లి అప్పుడప్పుడు భారత్ తీసుకెళ్లేదని కమలా హారిస్ గుర్తు చేసుకున్నారు.

తన సోదరి మాయతో కలిసి తాతయ్య వెంట చెన్నై వీధుల్లో తిరిగేవాళ్లమని, ఆయన భారత స్వాతంత్ర్య సమరయోధుల గురించి చెప్పేవారని వివరించారు. తన తల్లి శ్యామల బాల్యంలో తమకు ఇడ్లీలు తినిపించేందుకు ఎంతో శ్రమపడేదని చెప్పుకొచ్చారు.



More Telugu News