శ్రీశైలానికి భారీ వరద... 870 అడుగులకు నీటిమట్టం!

  • కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేని వర్షాలు
  • శ్రీశైలం జలాశయంలో 141 టీఎంసీలకు పైగా నీరు
  • ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నది
ఎగువన కర్ణాటక రాష్ట్రంతో పాటు, కృష్ణా పరీవాహక ప్రాంతమైన నల్లమల అడవులు, ఉమ్మడి మహబూబ్ నగర్, కర్నూలు, జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు నదిలో భారీ వరద పారుతోంది. ఆల్మట్టి మినహా మిగతా జలాశయాలన్నీ ఇప్పటికే నిండిపోగా, శ్రీశైలానికి పెద్ద ఎత్తున వరద వస్తోంది. మొత్తం 885 అడుగుల నీటిమట్టం సామర్థ్యమున్న జలాశయంలో ప్రస్తుతం 870 అడుగుల నీటిమట్టం ఉంది. రిజర్వాయర్ లో 141 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉందని, 1.22 లక్షలకు పైగా ఇన్ ఫ్లో వస్తుండగా, జల విద్యుత్ కేంద్రాల ద్వారా 43,048 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ నీరు నాగార్జున సాగర్ జలాశయానికి పోటెత్తుతోంది.

కాగా, నల్గొండ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు ప్రకాశం బ్యారేజ్ వద్దకు భారీగా వరద నీరు చేరుకోవడంతో, అధికారులు 70 గేట్లనూ ఎత్తివేశారు. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద 1.10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, 91 వేలను నది ద్వారా సముద్రంలోకి, మిగతా నీటిని కాలువల ద్వారా కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యవసాయ పనుల నిమిత్తం వదులుతున్నారు. మున్నేరుతో పాటు కట్టలేరు, వైరాల ద్వారా ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వస్తోందని అధికారులు వెల్లడించారు. మున్నేరు నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలకు రాకపోకలు తెగిపోయాయి.

మరోవైపు గోదావరిలోనూ భారీ ఎత్తున వరద ప్రవాహం నమోదవుతోంది. దిగువ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు నదిలో నీరు క్షణక్షణానికీ పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద గేట్లన్నీ ఎత్తివేసి 3 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.


More Telugu News