సెప్టెంబరు 1 నుంచి రొటేషన్ పద్ధతిలో పనిచేయనున్న ఢిల్లీ హైకోర్టు

  • కరోనా కారణంగా మార్చి 25న మూతపడిన కోర్టు
  • ఢిల్లీలోని ఏడు జిల్లా కోర్టులను తెరవాలని హైకోర్టు నిర్ణయం
  • నాలుగో వంతు సిబ్బందితో కార్యకలాపాలు
కరోనా వైరస్ కారణంగా దాదాపు ఐదు నెలలపాటు మూతపడిన కోర్టులను తిరిగి తెరవాలని ఢిల్లీ హైకోర్టు నిర్ణయించింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రొటేషన్ పద్ధతిలో జిల్లా కోర్టులను తిరిగి తెరవనున్నట్టు కోర్టు పేర్కొంది. ఢిల్లీలోని ఏడు జిల్లా కోర్టులతోపాటు హైకోర్టును కూడా రొటేషన్ ప్రాతిపదికన తిరిగి తెరుస్తామని తెలిపింది. కోర్టులను ప్రయోగాత్మకంగా తెరుస్తున్నా, ప్రజా రవాణా లభ్యత, కరోనా వ్యాప్తి పరిస్థితిపై ఇది ఆధారపడి ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.

అలాగే, కోర్టులలోని మొత్తం సిబ్బందిలో నాలుగో వంతు మంది మాత్రమే పనిచేసేందుకు అవకాశం ఉందని, ఇది ఒక ప్రయోగమని హైకోర్టు రిజిస్ట్రార్ మనోజ్ జైన్ పేర్కొన్నారు. నాలుగో వంతు సిబ్బందితో కోర్టు కార్యకలాపాలు కొనసాగుతాయని, మిగతా కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించవచ్చన్నారు. కరోనా కారణంగా మార్చి 25న మూతపడిన కోర్టులు జూన్‌లో లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత వీడియో కాన్ఫరెన్సింగ్ విధానం ద్వారం కేసులను విచారిస్తున్నాయి.


More Telugu News