ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తుతున్న వరద.. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

  • ఇంద్రావతి, కాళేశ్వరం నుంచి పెద్ద ఎత్తున వరద
  • నీటి మట్టం మరో ఐదు అడుగులకు పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక
  • లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ ఉదయం ఆరు గంటల సమయానికి నీటిమట్టం 48.1 అడుగులకు చేరుకుంది. నిన్న మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు, నేడు నీటి మట్టం మరింత పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

నీటి మట్టం మరో 5 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. వరద తాకిడికి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో ఆ ప్రాంత వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. వెంటనే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ఎగువ ప్రాంతాలైన ఇంద్రావతి, కాళేశ్వరం నుంచి వరద నీరు పోటెత్తుతుండడంతోనే భద్రాచలం వద్ద గోదావరికి భారీ స్థాయిలో నీరు వస్తోందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు.


More Telugu News