ఐక్యరాజ్యసమితిలో అమెరికాకు ఎదురుదెబ్బ... ఇరాన్ పై వీగిన తీర్మానం!

  • ఇరాన్ పై ఆంక్షలు శాశ్వతం చేయాలని తీర్మానం
  • కేవలం రెండు దేశాల నుంచి మాత్రమే మద్దతు
  • వీటో ఉపయోగించే అవసరం లేకుండానే పరాజయం
ఇరాన్ పై గతంలో ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను నిరవధికంగా కొనసాగించాలన్న అమెరికా ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ మేరకు యూఎన్ భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు లభించలేదు. మండలిలోని 15 సభ్య దేశాల్లో 9 దేశాలు మద్దతు పలికితే తీర్మానం ఆమోదించబడుతుంది. యూఎస్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా రెండు ఓట్లు మాత్రమే వచ్చాయి. వ్యతిరేకంగా రెండు ఓట్లు రాగా, 11 సభ్య దేశాలు ఓటింగ్ లో పాల్గొనలేదు. రష్యా, చైనాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశాయి. అయితే, తీర్మానం ఆమోదం కాకపోవడంతో, తమ వీటో అధికారాన్ని వినియోగించుకునేందుకు వాటికి అవకాశం దక్కలేదు.

తమ తీర్మానం వీగిపోయిందని యూఎస్ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్వయంగా వెల్లడించారు. కాగా, 2015లో ఇరాన్ కు, యూఎస్, రష్యా, చైనాలు సహా ఆరు పెద్ద దేశాలతో కుదిరిన అణ్వాయుధ నిరాయుధీకరణ ఒప్పందం మేరకు, ఆయుధాల నిర్వీర్యానికి కృషి చేయాల్సి వుంది. ఈ డీల్ నుంచి ట్రంప్ సర్కారు 2018లో వైదొలగిందన్న సంగతి తెలిసిందే.


More Telugu News