అనేక వివాదాల తర్వాత.. మోదీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నేపాల్ ప్రధాని!

  • ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపిన ఓలీ
  • ఏ సాయం కావాలన్నా చేస్తామని భరోసా ఇచ్చిన మోదీ
  • ఇరు దేశాల మధ్య సాంస్కృతిక బంధం కొనసాగాలని ఆకాంక్ష
ప్రధాని మోదీకి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఫోన్ చేశారు. భారత 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోదీకి, దేశ ప్రజలకు ఓలీ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి తోడు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో నాన్-పర్మినెంట్ మెంబర్ గా భారత్ గెలవడంపై గ్రీటింగ్స్ చెప్పారు.

ఇటీవలి కాలంలో ఓలీ చర్యలు భారత్ కు వ్యతిరేకంగా ఉంటున్న సంగతి తెలిసిందే. చైనా ప్రోద్బలంతో ఆయన యాంటీ ఇండియా స్టాండ్ తీసుకున్నారు. ఆయన వ్యవహారశైలిని ఆయన సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారంటే... ఆయన తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేపాల్ మ్యాప్ ను మార్చడం, రాముడి జన్మస్థలం నేపాల్ లోనే ఉందని వ్యాఖ్యానించడం... ఇలా అన్నీ భారత్ కు వ్యతిరేకమైన పనులనే ఆయన చేస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో, చాలా రోజుల తర్వాత ప్రధాని మోదీకి ఓలీ ఫోన్ చేయడం గమనార్హం.

ఫోన్ కాల్ సందర్భంగా... నేపాల్ కు ఎలాంటి సాయం కావాలన్నా చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ఓలీకి మోదీ భరోసా ఇచ్చారు. తద్వారా ప్రపంచ క్షేమాన్ని ఆకాంక్షించే భారత్ నైజాన్ని మరోసారి చాటారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో కూడా నేపాల్ కు భారత్ అండగా ఉంటుందని చెప్పారు. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక బంధం కొనసాగాలని ఆకాంక్షించారు. నేపాల్ తరపున శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు.


More Telugu News