జాతీయ జెండా ఆవిష్కరించిన తెలంగాణ సీఎం కేసీఆర్

  • ప్రగతిభవన్‌లో వేడుక
  • సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్లి అమరవీరులకు నివాళులు
  • నిరాడంబరంగా పంద్రాగస్టు వేడుకలు
  • గవర్నర్ నిర్వహించే 'ఎట్‌హోం' కార్యక్రమం రద్దు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని‌ ప్రగతిభవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన వెంట టీఆర్ఎస్ నేత కే కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి,  ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ తదితరులున్నారు.

అనంతరం అక్కడి నుంచి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్లి అమరవీరులకు నివాళులు అర్పించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో స్వాతంత్ర్య వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది ఆగస్టు 15న గోల్కొండ కోట వేదికపై జరిపే వేడుకను కరోనా నేపథ్యంలో ఈ ఏడాది రద్దు చేశారు.

తెలంగాణలోని జిల్లాల్లోనూ ఆడంబరాలకు దూరంగా వేడుకలు జరుగుతున్నాయి. తెలంగాణ మంత్రులు, అధికారులు ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద జాతీయ జెండాను ఎగురవేస్తున్నారు. కరోనా నిబంధనల మేర అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నిర్వహించే 'ఎట్‌హోం' కార్యక్రమం కూడా రద్దయింది.

వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో మాట్లాడుతున్నారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందు వరసలో ఉందన్నారు.


More Telugu News