రాజ్యాంగం, చట్ట ప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యం: జగన్

  • ప్రతి పౌరుడు దేశభక్తిని పెంచుకోవాలి 
  • అన్ని వర్గాల వారి సంక్షేమమే మా లక్ష్యం
  • అనేక పథకాలను అమలు చేస్తున్నాం  
  • 14 నెలలుగా గొప్ప సంకల్పంతో అడుగులు
ప్రతి పౌరుడు దేశభక్తిని పెంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. విజయవాడలోని మునిసిపల్ స్టేడియంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ.. రాజ్యాంగం, చట్ట ప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.

స్వాతంత్ర్యం అనేది ప్రాణవాయువు వంటిదని మహాత్మా గాంధీ చెప్పారని జగన్ గుర్తుచేశారు. సమాజంలో సమానత్వం అన్న పదాన్ని పుస్తకాలకు మాత్రమే పరిమితం చేయకూడదని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాల వారి సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

రైతు భరోసా, పెన్షన్ కానుక, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, కాపు నేస్తం, కంటి వెలుగు వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నామని జగన్ చెప్పారు. పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కుల, మత, ప్రాంత, వర్గ, పార్టీ భేదాలకు అతీతంగా నవ రత్నాలు అందిస్తున్నామని చెప్పారు. 14 నెలలుగా గొప్ప సంకల్పంతో అడుగులు వేశామని తెలిపారు.

మరో 10-20 ఏళ్ల తర్వాత ఆంధ్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో విద్యలో పోటీ పడేలా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నామని జగన్ తెలిపారు. రైతు భరోసా ద్వారా అన్నదాతలకు సాయం అందిస్తున్నామని చెప్పారు. పేదలకు 30 లక్షల ఇళ్ల స్థలాలు అందిస్తున్నామని తెలిపారు.


More Telugu News