కరోనాతో చికిత్స పొందుతూ సెక్యూరిటీ గార్డు మృతి.. 22 రోజులకు రూ. 20 లక్షల బిల్లు చేతికిచ్చిన ఆసుపత్రి

  • గత నెల 20న సికింద్రాబాద్‌లోని ఆసుపత్రిలో చేరిక
  • ఈ నెల 12న మృతి.. రూ. 11.50 లక్షలు చెల్లించిన బాధిత కుటుంబం
  • మిగతా డబ్బులు ఇస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని మెలిక
కరోనాకు చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేస్తున్న బిల్లులపై విమర్శలు వెల్లువెత్తుతున్నా, ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా వాటి తీరు మాత్రం మారడం లేదనడానికి ఇది పెద్ద ఉదాహరణ. 22 రోజులు చికిత్స అందించినప్పటికీ వ్యక్తి మృతి చెందగా, అందుకుగాను ఏకంగా రూ. 20 లక్షల బిల్లు చేతికివ్వడంతో బాధిత కుటుంబం షాక్‌కు గురైంది. సికింద్రాబాద్‌లో జరిగిందీ ఘటన.

ముషీరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి (49) సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. కరోనా సోకడంతో గత నెల 20న సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఈ నెల 12న రాత్రి మృతి చెందాడు. 22 రోజులపాటు అతడికి చికిత్స అందించినందుకు ఆసుపత్రి యాజమాన్యం రూ. 20 లక్షల బిల్లు అతడి కుటుంబ సభ్యులకు అందించింది. ఈ మొత్తంలో రూ. 11.50 లక్షలను బీమా ద్వారా చెల్లించారు. అయితే, మిగతా సొమ్ము కూడా ఇస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని చెప్పడంతో కుటుంబం విస్తుపోయింది. దీంతో బాధిత కుటుంబం మరికొందరితో కలిసి వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది.


More Telugu News