ఢిల్లీలో ప్రారంభమైన పంద్రాగస్టు వేడుకలు.. ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం కావాలని ప్రధాని పిలుపు!

  • రాజ్‌ఘాట్‌ వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఎర్రకోటకు మోదీ
  • కార్యక్రమానికి హాజరైన 4 వేల మంది అతిథులు
  • ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని
దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎర్రకోట వద్ద భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రధాని నరేంద్రమోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు రాజ్‌ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులు అర్పించారు. కరోనా నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కార్యక్రమానికి దాదాపు 4 వేల మంది అతిథులు హాజరయ్యారు.

పతాక ఆవిష్కరణ అనంతరం ఎర్రకోటపై నుంచి మోదీ మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో దేశం ముందడుగు వేయడానికి సిద్ధమైందన్నారు. కరోనా ఆపత్కాలంలో దేశం ఏకతాటిపై నిలిచిందన్నారు. 25 ఏళ్లు వస్తేనే తన కొడుకు సొంతకాళ్లపై నిలబడాలని కుటుంబం కోరుకుంటుందని, కానీ 75 ఏళ్లు వచ్చినా దేశం మాత్రం స్వయం సమృద్ధి సాధించలేకపోయిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి బలమైన సంకల్పంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కాణించారు. భారత్ అంటే క్రమశిక్షణ మాత్రమే కాదని, ఉన్నత విలువలతో కూడిన జీవనమన్నారు. ఆత్మనిర్భర్ భారత్ నినాదంగా మిగిలిపోకూడదని, అది అందరి సంకల్పం కావాలని మోదీ పిలుపునిచ్చారు.


More Telugu News