ఈ చీరలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయట!

  • సుగంధ ద్రవ్యాలతో చీరలు
  • ఇమ్యూనిటీ పెంచుతాయంటున్న అధికారులు
  • ఒక్కో చీర ఖరీదు రూ.3 వేలు!
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ సాధారణ స్థాయిని దాటిపోయింది. ప్రజలు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటూ ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇమ్యూనిటీని పెంపొందించే చీరలు అంటూ కొన్ని విలక్షణమైన చీరలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ఆయుర్ వస్త్రా పేరుతో ఈ చీరలను మధ్యప్రదేశ్ హ్యాండ్లూమ్ మరియు హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్ విపణిలోకి ప్రవేశపెట్టింది. విశేషం ఏంటంటే... ఈ చీరలను  వంటకాల్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలతో రూపొందించారు. ఈ చీరలు మహిళల్లో ఇమ్యూనిటీని పెంచుతాయని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు.

చీరలే కాదు, ఇతర రకాల దుస్తులు కూడా ఈ తరహాలోనే రూపొందించారట. ఈ ఇమ్యూనిటీ పెంచే చీరలను ప్రముఖ వస్త్ర నిపుణుడు వినోద్ మాలేవర్ కు అక్కడి ప్రభుత్వం అప్పగించింది. ఈ తరహా వస్త్రాల రూపకల్పనలో యాలకులు, జాపత్రి, లవంగాలు, నల్ల మిరియాలు, బిర్యానీ ఆకు, రాయల్ జీలకర్ర, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలను ఉపయోగించారు. వీటిని పొడిచేసి రెండ్రోజుల పాటు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత ఆ నీటిని మరిగించగా వచ్చిన ఆవిరిని చీరలకు పట్టిస్తారు. ఈ పద్ధతిలో ఓ చీర ఇమ్యూనిటీ పెంచే లక్షణాలు అందిపుచ్చుకోవడానికి గరిష్టంగా 6 రోజుల వరకు పడుతుందట.

వస్త్ర నిపుణుడు వినోద్ మాలేవర్ మాట్లాడుతూ, ఇది వందల ఏళ్ల నాటి పురాతన పద్ధతి అని వెల్లడించారు. కాగా, ఈ చీర ఖరీదు మాత్రం కాస్త ఎక్కువే. ఒక్కో చీరను రూ.3 వేలకు విక్రయించనున్నామని, మధ్యప్రదేశ్ హ్యాండ్లూమ్ మరియు హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్ కమిషనర్ రాజీవ్ శర్మ తెలిపారు.


More Telugu News