ఒకే దేశం-ఒకే హెల్త్ కార్డ్.. ఎర్రకోట నుంచి రేపు కీలక ప్రకటన చేయనున్న మోదీ

  • ప్రజల ఆరోగ్య వివరాలు డిజిటల్ ఫార్మాట్ లో నమోదు
  • ఏ ఆసుపత్రికి వెళ్లినా రిపోర్టులు, ప్రిస్క్రిప్షన్లు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు
  • ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేక ఐడీ కేటాయింపు
ప్రధాని మోదీ రేపు కీలక ప్రకటన చేయనున్నారు. భారతదేశ 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ... ఒకే దేశం-ఒకే హెల్త్ కార్డ్ (వన్ నేషన్ వన్ హెల్త్ కార్డ్) పథకాన్ని ప్రకటించనున్నారు.

ఈ పథకం కింద దేశంలోని ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలన్నింటినీ డిజిటల్ ఫార్మాట్ లో నమోదు చేయనున్నారు. ప్రతి వ్యక్తి చేయించుకున్న టెస్టులు, తీసుకున్న ట్రీట్మెంట్ వివరాలన్నీ ఈ కార్డులో సేవ్ చేయనున్నారు. ఆసుపత్రులు, క్లినిక్స్, డాక్టర్ల వివరాలను కూడా సెంట్రల్ సర్వర్ తో లింక్ చేస్తారు. అయితే ఈ స్కీమ్ ను ఉపయోగించుకోవాలాా? వద్దా? అనేది ప్రజలు, ఆసుపత్రుల సొంత నిర్ణయానికే వదిలేస్తారు.

ఈ కార్డుతో అనుసంధానమయ్యే ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేక ఐడీని కేటాయిస్తారు. ఈ ఐడీని ఉపయోగించుకుని సిస్టమ్ లోకి లాగిన్ కావచ్చు. సంబంధిత వ్యక్తి అనుమతితోనే డాక్టర్లు, ఆసుపత్రులు వ్యక్తిగత రికార్డులను చూసే అవకాశం ఉంటుంది. ఈ పథకాన్ని దశల వారీగా చేపట్టనున్నారు. తొలి దశకు సంబంధించి రూ. 500 కోట్ల బడ్జెట్ ను కేటాయించారు.

ఈ పథకం వల్ల ఉపయోగం ఏమిటంటే... ఏ వ్యక్తి అయినా దేశంలో ఉన్న ఏ ఆసుపత్రికి వెళ్లినా... ప్రిస్క్రిప్షన్లు, రిపోర్టులు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రత్యేక ఐడీ ద్వారా పేషెంట్ వివరాలన్నింటినీ డాక్టర్లు చూసే వీలు ఉంటుంది. ఆధార్ కార్డుకు అనుసంధానంగా హెల్త్ కార్డు ఉంటుంది. ప్రజల వివరాలకు సంబంధించి పూర్తి సెక్యూరిటీ ఉంటుంది. దేశ ఆరోగ్య వ్యవస్థ రూపు రేఖలను ఈ పథకం మారుస్తుందని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో హెల్త్ కార్డ్ ను మెడికల్ స్లోర్లు, ఇన్స్యూరెన్స్ కంపెనీలకు కూడా విస్తరిస్తారు.


More Telugu News